చిక్కడపల్లి, సెప్టెంబర్ 27: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన దేవర చిత్రం శుక్రవారం భారీ ఎత్తున విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ -35 థియేటర్లో ఈ చిత్రంలో విడుదలైన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున టపాసులు పేల్చారు. దీంతో ప్రమాదవశాత్తు జూనియర్ ఎన్టీఆర్ కటౌట్‌కు నిప్పు అంటుకుంది.
వెంటనే స్పందించి థియేటర్ సిబ్బంది ఫైర్ సెఫ్టీ పరికరాల సహాయంతో మంటలార్పే ప్రయత్నం చేశారు. అదే విధంగా విషయం తెలుసుకున్న ముషీరాబాద్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్ నేతృత్వంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగ లేదు. కాగా, ఎన్టీఆర్ కటౌట్ తగలబడుతున్న ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ చిత్రం నచ్చని కొంత మంది ఎన్టీఆర్ కటౌట్‌ను తగలబెట్టి ఉంటారన్న ప్రచారం కూడా విస్తృతంగా జరిగింది.