Artisans | సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసిన తర్వాతే జూనియర్ లైన్మెన్, సబ్ ఆర్డినెట్స్, జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టిజెన్లు గురువారం ఖైరతాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేశారు. 2వేలకుపైగా ఆర్టిజన్లు బైఠాయించి.. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ.. నినాదాలతో హోరెత్తించారు.
విద్యార్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలని, వెంటనే ఆర్టిజన్స్‌ను రెగ్యులరైజ్ చేసి, అర్హులకు పదోన్నతులు కల్పించాలని ఆందోళన చేశారు. విద్యుత్ శాఖ అధికారులను తమ డిమాండ్లను పరిష్కరించే వరకూ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేసే ఆర్టిజన్లు ఎన్నో కష్టాలు పడుతూ విధులు నిర్వహిస్తున్నా.. వారికి గుర్తింపు లేకుండా పోతున్నదని ఆర్టిజెన్స్ జేఏసీ నాయకులు ఈశ్వర్రావు, గాంబో నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ నెట్ వర్క్‌లో ప్రమాదకరమైన పనులు చేస్తున్న ఆర్టిజన్లకు ఉద్యోగ భద్రత కరువైందని, ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డిస్కం పరిధిలో 20-30 ఏండ్లుగా పనిచేస్తున్నామని, మొత్తం 19,748 వరకు ఆర్టిజన్లు ఉన్నారన్నారు. నిరసనలో ఆర్టిజన్స్ జేఏసీ నాయకులు వజీర్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.