Hyderabad | హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన జూనియర్ డాక్టర్ నాగప్రియ చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఆస్పత్రి సిబ్బంది ఈ విషయాన్ని దాచిపెట్టి డబ్బులు కట్టించుకోవడమే కాకుండా.. మరో 4 లక్షలు కడితేనే డెడ్‌బాడీని అప్పగిస్తామని బెదిరించారు. డబ్బులు కట్టలేదని వైద్యం నిరాకరించడంతో నాగప్రియ మృతిచెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. జూనియర్ డాక్టర్ నాగప్రియ అనారోగ్యంతో ఇటీవల హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రిలో చేరింది. అయితే మంగళవారం అర్ధరాత్రి ఆస్పత్రి సిబ్బంది నాగప్రియ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి బిల్లు కట్టాలని డిమాండ్ చేశారు. డబ్బులు కట్టకపోతే వైద్యం ఆపేస్తామని బెదిరించారు. దీంతో బెంబేలెత్తిపోయిన కుటుంబసభ్యులు ఉదయానికల్లా లక్ష రూపాయలు తీసుకొచ్చి ఆస్పత్రిలో కట్టారు. అప్పుడు తీరగ్గా నాగప్రియ చనిపోయిందన్న విషయాన్ని సిబ్బంది బయటపెట్టారు. మిగతా 4 లక్షల రూపాయల డబ్బు చెల్లించాలని.. అప్పుడే డెడ్‌బాడీని అప్పగిస్తామని ఆస్పత్రి సిబ్బంది పట్టుబట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక మృతురాలి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది వైద్యం నిలిపివేయడం వల్లే నాగప్రియ చనిపోయిందని ఆరోపిస్తున్నారు.