మెహదీపట్నం, ఏప్రిల్ 9: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీయూడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన టీయూడబ్ల్యూజే హైదరాబాద్ అడహక్ కమిటీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ జర్నలిస్టులకు నివాస స్థలాలు అందించే విషయంలో ప్రభుత్వాలు అలసత్వ వైఖరిని అవలంభిస్తున్నాయని, వెంటనే ప్రస్తుత ప్రభుత్వం దీనిపై స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
గత కొంతకాలంగా జర్నలిస్టుల హెల్త్ కార్డులు కార్పొరేట్ వైద్యశాలల్లో పనిచేయటం లేదని, ఈహెచ్ఎస్ తోపాటు జేహెచ్ఎస్ కూడా అన్ని ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కార్డులను తగ్గించే దిశగా ఆలోచనలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇదే జరిగితే ఆందోళన బాట తప్పదని ఆయన హెచ్చరించారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పడి ఈ ఏడాది మే 31 నాటికి 25 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా రజితోత్సవాలు జరుపుకునే దిశగా సంఘం ఆలోచిస్తుందని, అన్ని జిల్లా బాధ్యులతో చర్చించి త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు.
ఈ మధ్యకాలంలో చత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని పెంచి మరి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని అందుబాటులోకి తేవాలని కోరారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి పి. యోగానంద్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్, రాష్ట్ర నాయకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం..
జిల్లా టీయూడబ్ల్యూజే నూతన కమిటీ అధ్యక్షులుగా: సీహెచ్ రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం.మల్లేష్, వి అజయ్, సువర్ణల, ప్రధాన కార్యదర్శిగా: ఎస్ సోమేశ్వర్, సంయుక్త దర్శులుగా రమేష్, ఆర్ ప్రవీణ్ కుమార్, కార్యనిర్వాహక కార్య దర్శులుగా ఎస్ వెంకట్, ఆర్ వెంకట్, కోశాధికారిగా బాపూరావు, కార్యవర్గ సభ్యులుగా సంతోష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శిగా, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జిగా నవీన్ కుమార్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ప్రకటించారు.