సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేని విధంగా సాంకేతిక విద్యా విధానంలో నాణ్యమైన విద్యను అందించేందుకు జేఎన్టీయూహెచ్ కృషి చేస్తుంది. యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా, విద్యాభివృద్ధికి సంబంధించిన సరికొత్త విధానాలను అవలంభించడానికి చర్యలు తీసుకుంటున్న వర్సిటీ, ఇప్పుడు పూర్వ విద్యార్థుల పాత్రను కూడా కీలకం చేయబోతుంది. యాభై ఏండ్ల జేఎన్టీయూ చరిత్రలో ఐఏఎస్‌లు, సైంటిస్టులు, పారిశ్రామిక వేత్తలు, సీఈవోలు, యూఎస్ఏ, లండన్ వంటి దేశాలలో కూడాఎందరో ఉన్నత హోదాలలో ఉన్నారు.
వారంతా ప్రస్తుతం, జేఎన్టీయూహెచ్ అభివృద్ధిలో భాగస్వాములు కాబోతున్నారు. ఇప్పటికే టాప్‌లో ఐఏఎస్‌లు, సీనియర్ సైంటిస్టులు, సీఈవోలు, పారిశ్రామిక వేత్తల జాబితాలు సిద్ధం చేశారు. పూర్వ విద్యార్థుల కలయిక కోసం దేశాల వారీగా చాప్టర్లు ప్రారంభిస్తున్నారు. అయితే వారందరని ఏకం చేసి ఒక తాటి మీదుకు తీసుకురాబోతున్నట్టు జేఎన్టీయూ హైదరాబాద్ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పడగా, దానికి పూర్వ విద్యార్థి డాక్టర్ ఎస్.విజయ్ మోహన్ రావు ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు.
గోల్డెన్ జూబ్లీ నేపథ్యంలో పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ అభివృద్ధికి తమ వంతు సహాయం చేస్తున్నారు. ఇప్పటికే జేఎన్టీటీయూ క్యాంపస్‌లో పూర్వ విద్యార్థుల పేరుతో ఒక నూతన భవనం నిర్మిస్తున్నారు. దానికి రా్రష్ట్ర గవర్నర్ కూడా శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.10 కోట్లు పెట్టిన పూర్వ విద్యార్థులు ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ధ్రువీకరించారు.
ఇప్పుడు జేఎన్టీయూలో చదువుతున్న గ్రామీణ విద్యార్థులే లక్ష్యంగా బీటెక్, ఎంటెక్ వంటి ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇండస్ట్రీయల్ ట్రైనింగ్‌లు, ఇంటెర్న్షిప్లు, విద్యార్థుల కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సెమినార్లు, మంచి ప్రాజెక్టులు ఉన్న పేద విద్యార్థులకు అవసరమైన విధంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పూర్వ విద్యార్థులలోని పారిశ్రామిక వేత్తలు ముందుకు రానున్నారు. ఐటీ, మార్కెట్ వంటి ఉద్యోగాలు చేయాలనుకున్న విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, భాషా పరమైన నైపుణ్యాలు అందించనున్నారు.
రానున్న రోజులలో జేఎన్టీటీయూ హైదరాబాద్‌లో నాణ్యమైన విద్యను అందించడానికి మా వంతు సహాయం అందిస్తాం. దేశ విదేశాలలో పూర్వ విద్యార్థులు ఎక్కడా ఉన్న వారి వివరాలు సేకరించి, అందరినీ ఏకం చేస్తాం. గ్రామీణ విద్యార్థులను పట్టణ విద్యార్థులతో సమానంగా టెక్నికల్లో ఎక్స్‌ఫోజర్ వచ్చే విధంగా పలు రకాల శిక్షణ ఇస్తాం. అందుకు కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం. వారికి ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. యూనివర్సిటీ క్యాంపస్ కాలేజీ విద్యార్థులే కాకుండా అఫిలియేటెడ్ కాలేజీ విద్యార్థులకు కూడా ఇండస్ట్రీయల్ ట్రైనింగ్, సెమినార్లతో పాటు ప్రోత్సాహకాలు కల్పిస్తాం. డాక్టర్ విజయ్‌మోహన్ రావు, ప్రెసిడెంట్, జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల సంఘం