JNTU | కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 21: జేఎన్టీయూహెచ్ వర్సిటీలోని హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం పరిశుభ్రంగా ఉండాలని.. రుచి, నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని వర్సిటీ రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వర్రావు అన్నారు. శుక్రవారం వర్సిటీలోని మంజీరా హాస్టల్‌ను రిజిస్ట్రార్ కె. వెంకటేశ్వర్రావు, కళాశాల ప్రిన్సిపాల్ జి. వెంకటనర్సింహారెడ్డి, చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్‌రెడ్డి, హాస్టల్ వార్డెన్ దుర్గాకుమార్, పీఆర్వో ప్రసన్న పరిశీలించారు. హాస్టల్లోని వంటగదిలో ఉన్న వంటపాత్రల శుభ్రత, కూరగాయల నాణ్యత, వంట చేసేవారి పరిశుభ్రతతో పాటు వివిధ అంశాలను పరిశీలించారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేసి, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ భోజనం విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. ఆ సమస్యలను వెంటనే హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావాలన్నారు. బయటి వ్యక్తులు హాస్టల్లోకి రాకుండా చూడాలని ప్రిన్సిపాల్, వార్డెన్‌ను ఆదేశించారు. హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరైన వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు ఇబ్బందులు ఎదురైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రిజిస్ట్రార్ వెంట పలువురు కళాశాల అధికారులు ఉన్నారు.