సిటీబ్యూరో, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): కృత్రిమ మేథస్సు పరిజ్ఞానంతో విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉద్యోగాలు పొందేలా చేసే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థలోని విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు మైఫర్పెక్టిస్ స్టార్టప్‌తో కలిసి పనిచేసే ఒక కొత్త వేదికను శనివారం రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, బాసర ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థ వైస్ చాన్సలర్ వి.వెంకటరమణ, ఐటీ శాఖ ఎమర్జింట్ టెక్నాలజీ వింగ్ డైరెక్టర్ రమాదేవి లంక సమక్షంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. టెక్నాలజీ పరంగా ఎంతో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకునేలా ఈ వేదిక విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. భవిష్యత్తు కోసం నైపుణ్యం కలిగిన విద్యార్థులను తయారు చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ఐటీ శాఖ తీసుకుందని, దీని ద్వారా విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.