సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రానున్న వేసవిలో జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందిస్తామని జలమండలి ఎండీ దానకిశోర్ ప్రకటించారు. వేసవిలో నీటి డిమాండ్ దృష్ట్యా అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేశామని, అవసరం మేరకు రిజర్వాయర్లలో నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. మంగళవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో వేసవి కార్యాచరణ, రెవెన్యూ, ట్రాన్స్మిషన్, ఓ అండ్ ఎం విభాగాల అధికారులతో ఎండీ దానకిశోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జలమండలి ప్రస్తుతం రోజూ 565 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తున్నదని, మరో 42 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. నగరంతో పాటు ఓఆర్ఆర్ లోపలి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ వేసవి మే నెలాఖరు నాటికి మొత్తం 42 ఎంజీడీల నీరు అదనంగా సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందులో నగర పరధిలో 22 ఎంజీడీలు, ఓఆర్ఆర్ లోపలి గ్రామాలకు 20 ఎంజీడీల నీరు కేటాయించామని, ఈ నెలలోనే అదనంగా 22 ఎంజీడీల నీరు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 14 ఎంజీడీలు ఇస్తుండగా.. నెలాఖరుకు మరో 8 ఎంజీడీలు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో 12, మేలో 8 ఎంజీడీలు అదనంగా సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.
జూన్ నాటికి ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఎండీ వెల్లడించారు. ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీలు,కార్పొరేషన్లు, పంచాయతీలు, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలకు ఇప్పటికే 20 ఎంజీడీల నీరు ఇస్తుండగా.. మరో 30 ఎంజీడీలు సరఫరా చేస్తామన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి మొత్తం 50 ఎంజీడీల నీరు సరఫరా అవుతుందన్నారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న బోర్ వెల్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా ? లేదా ? అని పరిశీలించాలని అధికారులకు ఎండీ సూచించారు. అవసరమైన చోట మాన్యువల్ మెయింటెనెన్స్ సిస్టం (ఏఎంఎస్) కింద మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అవసరమైన చోట్ల అదనంగా ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఎండీ ఆమోదం తెలిపారు. నగర వ్యాప్తంగా ప్రస్తుతం 74 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా.. అదనంగా మరో 3 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే అవసరం మేరకు ట్యాంకర్లు, ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి నీటి సరఫరా సమయాన్ని పెంచాలన్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలో కరెంటు కోతలు, మోటరు రిపేర్లు, తదితర సమస్యలు తలెత్తినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
కలుషిత నీరు సరఫరా కాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలపై తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. వాటర్ లీకేజీలు, సీవరేజి ఓవర్ ఫ్లోలను ఎప్పటికప్పుడు పరిషరించేలా చూడాలన్నారు. మ్యాన్ హోళ్ల నుంచి తీసిన సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ఎకడైనా మ్యాన్ హోళ్లు ధ్వంసమైతే వెంటనే పునర్మిర్మాణం చేపట్టాలని, మ్యాన్ హోళ్ల కవర్లు కనిపించని స్థితిలో ఉన్నా.. వెంటనే కొత్త మూతలను ఏర్పాటు చేయాలని ఎండీ దాన కిశోర్ అధికారులను ఆదేశించారు.
రంజాన్ మాసం దృష్ట్యా అవసరమైన చోట్ల మసీదులకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఎండీ సూచించారు. సీవరేజి ఓవర్ ఫ్లో వంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలు పరిషరించాలని పేరొన్నారు. దీనికోసం డివిజన్‌కు ఒక మినీ జెట్టింగ్ మిషన్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో ఈఎన్సీ, ఆపరేషన్స్ డైరెక్టర్-1 అజ్మీరా కృష్ట, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, టెక్నికల్ డైరెక్టర్ రవి కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్ -2 స్వామి, ఓ అండ్ ఎం, ట్రాన్స్ మిషన్ సీజీఎంలు, జీఎంలు, అధికారులు పాల్గొన్నారు.