సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ఐటీ ఉద్యోగులు తిరిగి తమ కార్యాలయాలకు వచ్చేస్తున్నారు. నగరంలోని ఐటీ కారిడార్‌కు ఇక గతంలో కొనసాగిన సందడి తిరిగి సంతరించుకుంటున్నది. కరోనా కారణంగా బోసిపోయిన ఐటీ కార్యాలయాల్లో నెమ్మదిగా టెకీల సందడి మొదలవుతున్నది. చాలా రోజుల నుంచి సాధారణ పరిస్థితులు నెలకొన్న దరిమిలా ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందిగా ఐటీ కంపెనీలు ఇప్పటికే సమాచారాన్ని అందించాయి. దాదాపుగా అన్ని కంపెనీలు ఈ నెల నాలుగో తేదీ నుంచి ఉద్యోగులకు ఆర్టీవో (రిటర్న్ టు ఆఫీస్)పై సమాచారాన్ని ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని హైసా, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. ఐటీ రంగాన్ని నమ్ముకొని ఉన్న వివిధ రంగాల్లో ఉపాధి అవకాశాలు సవ్యంగా సాగాలంటే కార్యాలయాలన్నీ టెకీలతో కళకళలాడాలని అంటున్నారు.
నగరంలోని ఐటీ కంపెనీల్లో సగానికి పైగా లీజు ప్రాతిపదికన ఆఫీసు స్పేస్‌లను తీసుకున్న కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనాతో రెండేళ్లకు పైగా వర్క్ ఫ్రం హోం అమలు కావడంతో చాలా కంపెనీలు తమ లీజులను రద్దు చేసుకున్నాయి. కార్యాలయ నిర్వహణకు మాత్రమే ఆఫీస్ స్పేస్‌ను ఉంచుకున్నాయి. అయితే, ప్రస్తుతం ఆర్టీవో దరిమిలా ఒకేసారి ఉద్యోగులు అందరూ వచ్చినా స్పేస్‌ను ఇచ్చే పరిస్థితులు లేవు. దీంతో హైబ్రిడ్ విధానం అమలు చేస్తున్నాయి. వారానికి కనీసంగా 2-3 రోజులు ఆఫీసుకు వచ్చి లాగిన్ కావాల్సిందిగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఇందుకు గాను టీం మేనేజర్ తమ బృందంలోని వారితో చర్చించి విధానాన్ని అమలు చేయాలని ఆదేశించాయి. మరికొన్ని కంపెనీలైతే సమీప కార్యాలయాల్లో లాగిన్ అయ్యే వెసులుబాటును కూడా కల్పిస్తున్నాయి. దీంతో బెంగళూరు, ఇతర రాష్ర్టాల్లోని పలు కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు నగరంలోని సంబంధిత కంపెనీ ఆఫీసులను కూడా వినియోగించుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉండే టెకీలు కూడా నెమ్మదిగా మకాం హైదరాబాద్‌కు మారుస్తున్నారు. వారంలో రెండు, మూడు రోజులు వెళ్లాల్సి ఉన్నందున నగరంలోకి వచ్చి ఉండటమే మంచిదని భావిస్తున్నారు.
కరోనా నేపథ్యంలో నగరంలోని ఐటీ కార్యాలయాలు వర్క్ ఫ్రం హోం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా ఐటీ రంగంలో ‘రిటర్న్ టు ఆఫీసు’ అనేది సాధారణ స్థితిలోకి రాలేదు. నగరంలో దాదాపు ఆరు లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉంటే.., ఇందులో 40 శాతానికి పైగా ఉద్యోగులు రాష్ట్రంలోని తమ సొంత ప్రాంతాల్లో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే, కరోనాతో ఐటీ రంగంలో ఎలాంటి కుదుపు లేకున్నా… ఐటీ కారిడార్‌లో ఐటీని నమ్ముకొని ఉన్న పలు రంగాల్లో మాత్రం ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. కొన్ని రోజులుగా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆర్టీవో పిలుపును ఇవ్వడంతో ఈ రంగాల్లోనూ సంతోషం వ్యక్తమవుతుంది. చాలా కంపెనీలు నాలుగైదు రోజులుగా హైబ్రిడ్ విధానంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ప్రస్తుతం, 20 శాతం మంది ఉద్యోగులు ఇప్పటికే ఆఫీసులకు వెళుతున్నట్లుగా అంచనా. క్రమంగా ఇది ఇంకా పెరుగనున్నది.
ఐటీ కారిడార్‌లో నెమ్మదిగా ఆర్టీవో మొదలవుతుండటంతో ఐటీపై ఆధారపడిన రంగాల్లో సంతోషం ప్రారంభమైంది. ఐటీ కారిడార్‌లో ఛాయ్‌వాలా మొదలు హోటల్స్, హాస్టల్స్, రవాణా ఇలా పలు రంగాలు ఐటీ రంగంపైనే ఆధారపడి లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా హైసా, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాదాపూర్‌లోని రహేజా ఐటీ పార్కులో సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా హైసా అధ్యక్షులు భరణి కే మాట్లాడుతూ, కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం ఆఫీస్‌కు మొగ్గు చూపుతున్నారని, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ సంస్థలు పూర్తి స్థాయిలో జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనులు చేస్తుండటంతో లక్షల మంది ఉపాధిని కోల్పోయారని, హాస్టల్స్ నిర్వాహకులు చాలా నష్టపోయారని పేర్కొన్నారు.
ప్రస్తుతం, కొవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో సంస్థలు కొవిడ్ భద్రతలను పాటిస్తూ ఉద్యోగులను కార్యాలయాలకు రావాల్సిందిగా కోరుతున్నారు. ఐటీ కారిడార్‌లో దాదాపు 3500 హాస్టల్స్ ఉన్నాయని, వాటి ద్వారా ప్రత్యక్షంగా లక్ష మంది పరోక్షంగా 1.50 లక్షల మంది ఉపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. ఐటీ సంస్థలు పునః ప్రారంభించిన నెల వ్యవధిలోనే 5 శాతం నుంచి 15 శాతానికి ఉద్యోగుల రాక ప్రారంభమైందని, డిసెంబర్ వరకు 70 నుంచి 80 శాతానికి పెరుగుతుందని తెలిపారు. కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారని, హాస్టల్స్‌లో సైతం పూర్తి స్థాయి భద్రత చర్యలు పాటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, అమర్నాథ్ ఆత్మకూరి, రహేజా కార్ప్ హెడ్ శ్రవణ్, ఐటీ హాస్టల్స్ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.