సికింద్రాబాద్ : సికింద్రాబాద్ కుమ్మరిగూడ లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ( Idol destruction ) ధ్వంసం ఘటన బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Ex-minister Talasani ) అన్నారు. బుధవారం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు.
సమాజంలో ఎవరి మనోభావాలు వారికి ఉంటాయని అందరి మనోభావాలను గౌరవించాలని కోరారు. ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని వెల్లడించారు. ప్రభుత్వం దోషుల పట్ల కఠినంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
భక్తుల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నూతన విగ్రహ ప్రతిష్ఠ కోసం తాను చర్యలు చేపట్టగా, అదే సమయంలో ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కోసం ముందుకొచ్చిందని వివరించారు. ప్రజల సంతోషమే తమకు ముఖ్యమని వివరించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, నాగులు, మహేష్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.