శామీర్పేట,నవంబర్ 30: విభిన్న ప్రతిభావంతులకు సేవలందించడం గొప్ప విషయమని, వారిని ప్రోత్సహి స్తూ సేవలను విస్తృతం చేయడమే అవార్డుల ఉద్ధేశమని ఛాయ్ డైరెక్టర్ జనరల్ మాత్యూఅబ్రహం అన్నారు. తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్లోని క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఛాయ్)లో విభిన్న ప్రతిభావంతులకు సేవలందిస్తున్న వ్య క్తులు, సంస్థలకు మేరీగ్లోరీ లిలియాన బ్రెకల్మెన్స్ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా ఛాయ్ డైరెక్టర్ జనరల్ మాత్యూఅబ్రహం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా విభిన్న ప్రతిభావంతులకు వైద్య, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న వ్యక్తులను, సంస్థలను మేరిగ్లోరీ లిలియాన బ్రెకల్మెన్స్ అవార్డులతో సత్కరించడం జరుగుతుందన్నారు. మేరీగ్లోరీ లిలియాన బ్రెకల్మెన్స్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డులను అందించడం జరుగుతుందన్నారు. 5 సంవత్సరాలకు పైబడి విభిన్న ప్రతిభావంతులకు సేవలందిస్తున్న వారిని గుర్తించి ఛాయ్-లిలియాన ఫౌండేషన్ సంయుక్తంగా నగదు పురస్కారాలను వారికి అందిస్తున్నట్లు వివరించారు.
వ్యక్తిగతంగా మహారాష్ర్టాకు చెందిన షిస్టర్ సీమిజోస్, మహారాష్ర్టాకు చెందిన రాజు వాగ్మారిలకు లక్ష రూపాయల చొప్పున, నవభారత్ జాగృతి కేంద్ జార్ఖాండ్, టెలిఛరి సోషల్సర్వీస్ సొసైటీ కేరళ సంస్థలకు రూ. 2లక్షల చొప్పున పురస్కారాలు అందించడం జరిగిందన్నారు. దేశ వ్యాప్తంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. ముందుగా ఛాయ్ డైరెక్టర్ జనరల్ మాత్యూఅబ్రహం జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా విభిన్నప్రతిభావంతుల సంస్కృతి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిలియాన ఫౌండేషన్ డైరెక్టర్ ఎరిక్ ఎకర్మెన్, వీగార్డ్ సీఎస్ఆర్ జీఎం బాబు అరవల్, సెన్స్ ఇంటర్నేషనల్ ఇండియా డైరెక్టర్ అఖిల్పాల్, మీడియా కో ఆర్డినేటర్లు రాపర్తి రమేశ్, హరిత్రాజ్, సోమశేఖర్, షకీబ్, తదితరులు పాల్గొన్నారు.