సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు సమృద్ధిగా తాగునీరందిస్తున్న జలమండలికి మరో ఘనత దక్కింది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్వో-9001 : 2015 ధ్రువ పత్రం మరోసారి లభించింది. ఈ ధ్రువీకరణను మరో మూడు సంవత్సరాల పాటు పొడిగిస్తున్నట్లు జియోటెక్ గ్లోబల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాన్ని టెక్నికల్ డైరెక్టర్ పి.రవికుమార్, ట్రాన్స్మిషన్ సీజీఎం దశరథ్ రెడ్డి ఎండీ దానకిశోర్‌కు మంగళవారం అందజేశారు. ఐఎస్వో ధ్రువీకరణ పొడిగింపు పట్ల ఎండీ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నందుకు జలమండలి ఉద్యోగులు, సిబ్బందిని ఆయన అభినందించారు.
జలమండలికి ఐఎస్వో ధ్రువపత్రం మొదటి సారి 2017 జూలైలో రాగా.. దాని కాలపరిమితి 2020 జూలై వరకు ఉంది. తర్వాత దానిని 2023 జూలై వరకు మరోసారి పొడిగించారు. తాజాగా మూడోసారి మూడేండ్ల పాటు పునరుద్ధరించారు. 2026 జూలై వరకు ఇది వర్తించనుంది. జలమండలి నదుల నుంచి నీటిని సేకరించిన మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు..నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ మొదలగు వాటిలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ ధ్రువపత్రాన్ని అందజేశారు.
నగర వాసుల దాహార్తిని తీర్చడానికి జలమండలి సుదూర ప్రాంతాల నుంచి భారీ పైపులైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నది. నాగార్జున సాగర్, కృష్ణా నది, ఎల్లంపల్లి జలాశయం, గోదావరి నదితో పాటు సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి నీటిని సేకరిస్తుంది. ఈ నీటిని ఆయా ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నిల్వ ఉంచి తాగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా క్లోరిన్ మోతాదు కలిపిన అనంతరం ప్రజలకు సరఫరా చేస్తున్నది.
నీటి సరఫరాలో జలమండలి ఇప్పటికే మూడంచెల క్లోరినేషన్ ప్రక్రియ పద్ధతిని అవలంభిస్తున్నది. మొదటి దశలో నీటి శుద్ధి కేంద్రాల (డబ్ల్యూటీపీ), రెండో దశలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు (ఎంబీఆర్) వద్ద, చివరగా సర్వీస్ రిజర్వాయర్ల వద్ద బూస్టర్ క్లోరినేషన్ ప్రక్రియ జరుగుతుంది. దీంతో పాటు ప్రజలకు సరఫరా అవుతున్న నీటిలో కచ్చితంగా 0.5 పీపీఎం క్లోరిన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగర ప్రజలకు శుద్ధమైన నీరు అందించేందుకు ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ-10500-2012) ప్రమాణాల్ని పాటిస్తూ శాస్త్రీయంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నట్లు అధికారులు వివరించారు.