మేడ్చల్, ఏప్రిల్7(నమస్తే తెలంగాణ): రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఈ నెల చివరి వారం నుంచి లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేసేలా అధికారం యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రెండో విడతలో 1296 మంది లబ్ధిదారులకు గొర్రెలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన గొర్రెలను రాష్ర్టానికి తీసుకువచ్చేందుకు టెండర్లను పశుసంవర్ధక శాఖ ఆహ్వానించింది. టెండర్ల ప్రక్రియను ఈనెల 18న పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నాటక రాష్ట్రంలోని బీదర్ నుంచి గొర్రెలను తీసుకురానున్నారు. మొదటి విడతలో గొర్రెల పంపిణీ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు రూ. 48 కోట్ల 82 లక్షలతో 75 శాతం సబ్సిడీతో 3,864 యూనిట్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేసింది.
75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ
గొర్రెల పంపిణీ పథకంలో లబ్ధిదారులకు 75 శాతం పై ఒక యూనిట్‌ను అందజేస్తున్నారు. ఒక యూనిట్లో 20 గొర్రెలు, ఒక పొట్టేలును రూ.లక్ష 75 వేల విలువైన గొర్రెలను అందజేస్తుండగా… లబ్ధిదారులు రూ.43,750 చెల్లిస్తే మిగతా రూ.లక్షా 30 వేలను ప్రభుత్వం చెల్లించి గొర్రెలను పంపిణీ చేస్తున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం రూ.17 కోట్లను వెచ్చించనుంది. గొర్రెల పంపిణీ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టాల నుంచి గొర్రెలను తీసుకువచ్చిన వెంటనే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది.