ఖైరతాబాద్, ఫ్రిబవరి 6 : అంతర్జాతీయ డ్రగ్ కింగ్(International drug king) పిన్ స్టాన్లీ(Pin Stanley) పోలీసులకు చిక్కాడు. గోవా కేంద్రంగా దేశ, విదేశాల్లో డ్రగ్స్‌ను విక్రయిస్తూ..సరఫరా చేస్తున్న ఇవూలా ఉకోడా స్టాన్లీ (43)ని పంజాగుట్ట పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.
నైజీరియా అనంబ్రా రాష్ట్రం, ఒనిట్షా ఇచిడాస్ట్రీట్కు చెందిన ఇవులా ఉకోడా స్టాన్లీ 2009లో బిజినెస్ వీసాపై భారత్‌కు వచ్చాడు. ముంబాయిలోని అందేరీలో ఉంటూ అతని స్నేహితుడితో కలిసి రెడీమేడ్ దుస్తుల వ్యాపారాన్ని ప్రారం భించాడని తెలిపారు. ఏడాది తర్వాత గోవాలోని కండోలిమ్‌కు చేరుకొని అక్కడే కొందరు నైజీరియన్లను కలుసుకున్నాడు. అప్పటి నుంచే డ్రగ్స్ ఎలా ఎలా సరఫరా చేయాలన్న మెళకువలను నేర్చుకొని మత్తు పదార్థాలను తెప్పించి గోవాకు వచ్చే పర్యాటకులకు వాటిని విక్రయించడం మొదలు పెట్టాడు. 15 సంవత్సరాలుగా తన చీకటి వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వచ్చాడు.
ప్రస్తుతం అతని వద్ద దేశ్యాప్తంగా 500 మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా, అందులో ఏడుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నారు. టీఎస్‌న్యాబ్, హెచ్‌న్యూ, ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలోని పంజాగుట్ట పోలీసు అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు నిందితుడిని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 8 కోట్ల విలువైన మత్తు పదార్థాలతో పాటు ఎనిమిది సెల్ఫోన్లు, రూ.5.40లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.