ఖైరతాబాద్‌లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో గురువారం ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు ఆవిష్కరణలు ఆలోచింపజేశాయి. చిత్రంలో మల్టీపర్పస్ చార్జింగ్ స్టేషన్ పనితీరును వివరిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు.
ఖైరతాబాద్, డిసెంబర్ 15: శాస్త్రవేత్తల తమ నూతన ప్రయోగాలు, ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రత్యేక హక్కులుంటాయని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లోని ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ ఆడిటోరియంలో ఇనిస్టిట్యూట్ ఫర్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో గురువారం ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్’పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ప్రొఫెసర్ నర్సింహా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. పరిశ్రమలు కానీ, వ్యాపారం కానీ, వస్తువుకు కానీ కాపీ రైట్ హక్కులు ఉంటాయని, అలాగే శాస్త్రవేత్తలకు, ఆవిష్కర్తలకు సైతం భారత ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించిందన్నారు. తమ ఆవిష్కరణలకు తామే యజమానులుగా ఉండాలన్నది దాని ఉద్దేశమన్నారు. వారిని ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి దేశాభివృద్ధిలో వారి ఆలోచనలు, ఆవిష్కరణలు దోహదపడేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సదస్సులో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ విపిన్ కుమార్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ కె.వరప్రసాద్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ విభాగం సీనియర్ మేనేజర్ డాక్టర్ దార అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థుల నూతన ఆవిష్కరణలను ప్రదర్శించి తమ ప్రతిభను చాటారు.
సైకిల్ తొక్కుతూ మిక్సీ పట్టవచ్చు
సైకిల్ తొక్కితే ఆరోగ్యమే కాదు…ఆకలి తీరుతుందని ఈ విద్యార్థులు నిరూపించారు. సైకిల్‌కు మిక్సీ యంత్రాన్ని అమర్చి తన మేథస్సుకు పదును పెట్టింది. అల్వాల్‌కు చెందిన డి.యోగిత. రామంతపూర్‌లోని జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజినీర్ విద్యనసభ్యసిస్తున్న యోగితాకు ఈ ఆలోచన తట్టింది. మామూలు సైకిల్‌కు వెనుక టైరు క్యారియర్‌పై ఓ మిక్సీ బ్రెండర్ను అమర్చింది. ఆ బ్రెండర్ను సైకిల్ వెనుక చక్రానికి అనుసంధానించి, బైస్కిల్ పెడెల్ పవర్డ్ బ్రెండర్గా నామకరణం చేసింది. ఏదైనా పని కోసమో…లేక ఉదయాన్నే సైక్లింగ్ కోసం వెళ్లే సమయంలో వెనుక మిక్సీ జార్‌ను అమర్చి అందులో జ్యూస్‌లు, పచ్చళ్లు, దోసపిండి లాంటివి పట్టుకోవచ్చంటున్న యోగిత చేసిన ఈ ప్రయోగం సఫలీకృతమైంది.
స్క్రీపై చేయి పెట్టకుండానే పెయింటింగ్..
కంప్యూటర్, ల్యాప్‌టాప్, ప్రొజెక్టర్ స్క్రీన్‌పై చేతులు పెట్టకుండానే గాలిలో చేతులను ఆడిస్తూ పెయిటింగ్ వేయవచ్చని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ సీఎస్సీ విద్యార్థి విరించి సాయి తన ప్రయోగాన్ని ప్రదర్శించి ఆలోచింపచేశాడు. ఓ ల్యాప్‌టాప్‌కు సాంకేతికపరమైన మార్పులు చేసి ఇమ్యూలిటీస్ (కలర్లు కలెక్ట్ చేసే ప్రక్రియ), నమ్పై (వేళ్ల స్పర్ష)ను అనుసంధానం చేశాడు. ఈ ప్రక్రియ ద్వారా ల్యాప్‌టాప్‌కు పది మీటర్ల దూరం నిలబడి చేతులను ఆడిస్తూ పెయింటింగ్ వేయవచ్చు. అవసరమైన అక్షరాలు దిద్దవచ్చు. ప్రధానంగా డిజిటల్ క్లాస్ రూమ్‌లో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విరించి సాయి చెప్పారు.
ఒక యంత్రం.. నాలుగు ప్రయోజనాలు
సాధారణంగా ఎలక్ట్రికల్ రంపంతో పలు పరిశ్రమల్లో ఇనుప, గాజు, ప్లాస్టిక్, కలప లాంటివి విడివిడిగా కట్ చేస్తారు. అయితే ఒకే యంత్రంతో ఆ నాలుగు పరికరాలను కట్ చేస్తే ఎలా ఉంటుందని? జేబీఈఐటీలో బీటెక్ (మెకానికల్) మూడో సంవత్సరం చదువుతున్న నందకిశోర్‌కు మెరుపలాంటి ఆలోచన వచ్చింది. మోటర్, రంపాలు తదితర ముడిసరుకులు తెచ్చుకొని ‘డిజైన్ ఫ్యాబ్రికేటెడ్ ఫోర్వే హాక్స్సా’ తయారు చేశాడు.
ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నిపుణుల ముందు ప్రదర్శించాడు. ైస్లెడర్ క్రాంక్ మెకానిజమ్ ఆధారంగా తయారు చేసిన యంత్రంతో ఒకేసారి నాలుగు రకాల పరికరాలను కట్ చేసి చూపించాడు.
ధాన్యాన్ని ఎండబెట్టవచ్చు..
రైతులు పండించిన ధాన్యం, ఆహార ఉత్పత్తులు ఒక్కో సారి వర్షపు నీటిలో తడిచి మొలకలు రావడమో..లేక చెడిపోవడమో జరుగుతుంది. తడిచిన ధాన్యాన్ని సైతం ఎండబెట్టి రైతులకు నష్టం జరుగకుండా ఉండేలా నలుగురు విద్యార్థులు ఆలోచన చేశారు. కరెంటు ఉపయోగించకుండానే సౌర విద్యుత్‌తో దానిని పనిచేయించేలా ప్రయోగాత్మకంగా ఓ యంత్రాన్ని తయారు చేశారు. మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో అభ్యసిస్తున్న ఎం.అనిల్ గౌడ్, టి.చేతన్, జి.నితిన్, తన్వీ నర్లేకర్లు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్, ఆర్డీయోనో లాంటి టెక్నాలజీని వినియోగించి ఆధునిక సౌర వేర్ హౌజ్‌ను తయారు చేశారు. ఇందులో ఆహార పదార్థాలు, వరి ధాన్యం, ఇతర గింజలు పెడితే అందులోని తడి ఆరిపోవడంతో పాటు ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది. ఈ యంత్రానికి స్మార్ట్ ఫోన్‌ను సైతం అనుసంధానం చేయగా, అందులో ఉష్ణోగ్రతను నేరుగా సెల్‌ఫోన్ నుంచే సెట్ చేసుకోవచ్చంటున్నారు.
బూస్ట్ కన్వర్టర్‌తో ఫోన్, ల్యాప్‌టాప్ చార్జింగ్..
సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, ఎలక్ట్రికల్ వాహనాన్ని చార్జింగ్ చేయాలంటే విద్యుత్‌పైనే ఆధారపడాలి. అయితే విద్యుత్ అవసరం లేకుండానే సోలార్ ప్యానెల్‌తో వాటన్నింటిని ఒకే యంత్రంతో ఒకే సారి లేక, వేర్వేరుగా చార్జింగ్ చేసుకోవచ్చు. సోలార్ ప్యానెల్ ద్వారా వచ్చిన విద్యుత్‌ను లిథియం బ్యాటరీలో భద్రపర్చి ఆ కరెంటును బూస్ట్ కన్వర్టర్ యంత్రం సాయంతో వోల్టేజిని సెల్ ఫోన్‌కు కావాల్సిన 12 వోల్టులు, ల్యాప్‌టాప్‌కు 20 వోల్టులు, ఈవీలకు కావాల్సిన 70 నుంచి 90 వోల్టులను పెంచుకొని చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ యంత్రాన్ని మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈఈఈ చదువుతున్న ఎన్. ఉమేశ్ తయారు చేశాడు.