కొండాపూర్, జనవరి 24 : సంస్కృతి, సంప్రదాయం, అనుబంధాలు, గతం తాలూకు జ్ఞాపకాలతో పలువురు కళాకారులు వేసిన పలు చిత్రాలు అందరినీ ఆకర్షించాయి. మంగళవారం మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘ఇండో – నేపాల్ ఆర్ట్ సింపోజియం -2023’ పేరిట ప్రత్యేక చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ప్రదర్శనలో ఉంచిన చిత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందమైన చిత్రాలను చూస్తుంటే మనస్సుకు ఆహ్లాదం, నూతనోత్తేజం చేకూరుతుందన్నారు. చిత్రకారులు తమ కుంచెతో గతాన్ని సైతం వర్తమానంలోకి తీసుకురాగలరని, తమ చిత్రాల ద్వారా గతంలోకి తీసుకెళ్లగలరని అన్నారు. అనంతరం చిత్రకారులను ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మితో కలిసి సన్మానించారు. ఈ చిత్ర ప్రదర్శనలో 35 పెయింటింగ్స్‌ను ఫిబ్రవరి 2వ తేదీ వరకు ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన పలువురు చిత్రకారులు పాల్గొన్నారు.