ఉప్పల్, జనవరి 24 : ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ మ్యాచ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ సుధీర్‌బాబు, మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్ డీసీపీ కె.మనోహర్ వివరాలను వెల్లడించారు.
స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం 1500 మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేశామన్నారు ట్రాఫిక్ సమస్యలు రాకుండా తగిన ఏర్పాట్లు చేశామని, తగిన సూచనలు కూడా చేస్తున్నామని తెలిపారు. బార్కోడ్ ట్యాంపరింగ్, బ్లాక్ టికెట్లు, మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. మ్యాచ్ భద్రత కోసం 360 కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తూ, సిబ్బంది అప్రమత్తంగా ఉంటారన్నారు. అనుమతిలేని వస్తువులను స్టేడియంలోకి తీసుకురావద్దని సూచించారు. మ్యాచ్‌కి మూడు గంటల నుంచే స్టేడియంలోకి అనుమతి ఇస్తామన్నారు.
ఉదయం 9.30 గంటలకే మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేశామన్నారు. క్రమశిక్షణను పాటిస్తూ, దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా హైదరాబాద్ నగర క్రీడా అభిమానులు సహకరించాలన్నారు. ఎవరికి కేటాయించిన గేట్ల నుంచి వారే వెళ్లాలని తెలిపారు. 39,600 మంది వీక్షించేందుకు వీలుగా స్టేడియంలో ఏర్పాట్లు ఉన్నాయని, ప్రేక్షకులు సహకరించాలన్నారు. పాఠశాల విద్యార్థులకు స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు అనుమతి ఇచ్చామని, అందరు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో ఏసీపీలు చంద్రశేఖర్, శ్రీనివాస్‌రావు, ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వీటికి అనుమతి లేదు..
స్టేడియంలోకి ల్యాప్టాప్స్, కెమెరాలు, మ్యాచ్బాక్సు, బైనక్యూలర్స్, బాటిల్స్, బ్యాగులు, బ్యానర్లు, సిగరెట్లు, లైటర్స్, హెల్మెట్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పవర్ బ్యాంక్స్, అవుట్‌సైడ్ ఫుడ్స్, తదితర వస్తువులకు అనుమతి లేదన్నారు.