మేడ్చల్, మే 23 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం హ్యత్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ‘ఇంటర్నేషనల్ లేబర్ కాన్లేవ్ 2023’ ప్రారంభోత్సవ సమావేశంలో కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో కలిసి తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందంటే సుమారు 15 ఇతర రాష్ర్టాల నుంచి 25 లక్షల మంది తెలంగాణ రాష్ర్టానికి వలస వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ర్టానికి వలస వచ్చిన వారందరికి పని లభిస్తున్నదని తెలిపారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మరణిస్తే కార్మిక బీమా కింద రూ.6 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అంగవైకల్యం చెందిన వారిని ఆదుకుంటున్నామని అన్నారు. వలస కార్మికులకు సకల సౌకర్యాలను కల్పిస్తూ సొంత వాళ్లలా చూస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని చెప్పారు.
కార్మికుల కూతురు విహహానికి, ప్రసూతికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో కార్మికులకు అన్నం పెట్టి, వైద్య సహాయం అందించి సొంత ఖర్చులతో గమ్యస్థానాలకు పంపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని చెప్పారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏర్పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి శివన్ కుట్టి, బీహార్ మంత్రి సురేంద్రరామ్, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేరళ రాష్ట్రంలోని పద్మనాభ స్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్‌రెడ్డి, మేయర్ కావ్య, పాల్గొన్నారు.