సుల్తాన్‌బజార్,జనవరి 28: నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా క్రీడల్లో రాణించడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం కోఠి మహిళా కళాశాల ఆడిటోరియంలో రాష్ట్ర మహిళా కమిషన్, జాతీయ మహిళా కమిషన్ల సంయుక్త ఆధ్వర్యంలో క్రీడల్లో మహిళల పాత్ర అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరై సునీతా లక్ష్మారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మహిళలు క్రీడల్లో రాణిస్తూ తమకు తామే సాటిగా నిలుస్తున్నారని అన్నారు. దేశం కోసం ఆడేందుకు వారు అన్ని అసమానతలను ఎదుర్కొని విజేతలుగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని ప్రకటించి రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లను నిర్వహిస్తూ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు, అసోసియేషన్లకు ఆర్థిక సహాయం అందజేస్తున్నదని గుర్తు చేశారు. విద్యార్థినులు పౌష్టికాహారం తీసుకుంటూ వ్యాయామ నియమాలను పాటించడం ద్వారా శారీరక ధృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామం, మండలం, పట్టణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు. నేటి సమాజంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని అన్నారు.
మహిళలకు ఏ సమస్య వచ్చినా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ @SCWTelangana, ఈ మెయిల్ telanganastatewomnencommission@gmail,com లేదా హెల్ప్‌లైన్ నంబర్ 100,181, కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు కుమ్రా ఈశ్వరీబాయి, పద్మ, లక్ష్మి, కటారి రేవతి, కమిషన్ సెక్రటరీ కృష్ణ కుమారి, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులత, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.