‘హైడ్రా’ ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నది.. అక్రమ నిర్మాణాలపై దూకుడు పెంచింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా యాక్షన్‌లోకి దిగుతున్నది.. చెరువులు..కుంటలు..నాలాలు.. పార్కులను కబ్జాచేసిన వారిపై ఉక్కుపాదం మోపుతున్నది… ఇప్పటికే బంజారాహిల్స్‌లోని మిథిలా నగర్ కాలనీ, లోటస్ పాండ్ పార్కు..గాజుల రామారం..బుమ్రుఖా ఉద్ దవాల్ చెరువుల్లో అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా.. తాజాగా గురువారం బాచుపల్లి ఎర్రకుంట చెరువులో వెలసిన అపార్ట్మెంట్లను కూల్చివేసింది.
-సిటీబ్యూరో/దుండిగల్, ఆగస్టు 15
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి పలు చెరువుల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను బుధవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించిన నేపథ్యంలో గురువారం తెల్లవారు జామున 2 గంటల నుంచే కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో బాచుపల్లిలోని సర్వే నంబర్ 134లోని మొత్తం మూడు అపార్ట్మెంట్లను కూల్చివేసేందుకు చర్యలు చేపట్టారు. మూడు బ్లాక్‌లలో ఈ అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతున్నది. ఒక్కో అపార్ట్మెంట్ 360 గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
అయితే ఎర్రకుంట చెరువు 3.20 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా…ఎఫ్టీఎల్ పరిధిలో ఈ మూడు అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతున్నదని హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. అయితే సదరు నిర్మాణదారులు రెవెన్యూ, ఇరిగేషన్ ఎన్వోసీల ఆధారంగా హెచ్ఎండీఏలో నిర్మాణానికి అనుమతి తీసుకొని.. దాదాపు రూ. 30 లక్షల మేర డెవలప్మెంట్ ఫీజు చెల్లించి నిర్మాణం చేపడుతున్నారు. వాస్తవంగా ఎఫ్టీఎల్లో నిర్మాణం ఉందని ధ్రువీకరించి హైడ్రా సదరు అపార్ట్మెంట్లను కూల్చారు. ఇందుకోసం భారీ కట్టింగ్ మిషన్లతో పాటు 2 భారీక్రేన్, 2 ఇటాచీల సహాయంతో చేపట్టిన కూల్చివేతల ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది.
ఇప్పటి వరకు రెండు అపార్ట్మెంట్లను నేలమట్టం చేసిన అధికారులు.. మరో అపార్ట్‌మెంట్‌ను శుక్రవారంలోగా కూల్చివేసామని అధికారులు తెలిపారు. కాగా ఈ అక్రమ నిర్మాణాల వెనుక సంబంధిత రెవెన్యూ మున్సిపల్ అధికారులు, హెచ్ఎండీఏ అధికారుల పాత్ర ఏమిటన్నది విచారణ చేపట్టకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు నిర్మాణదారులకు కూల్చివేతలపై నోటీసులు ఇవ్వలేదని, హైడ్రా ఏకపక్షంగా వ్యవహరించిందని, ఈ నష్టాన్ని ఎవరూ భరించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.