సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ ) : నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు వ్యవహరిస్తున్నారు జీహెచ్ఎంసీలోని కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు.. కండ్ల ముందు అక్రమ నిర్మాణమని తెలిసినా… ఏం చేయలేని.. చేతగాని స్థితిలో ఉంటున్నారు. అక్రమ నిర్మాణాన్ని ఆపాలని చుట్టూ పక్కల వారంతా అటు ప్రజావాణి, ఇటు మున్సిపల్ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. కంటి తుడుపు చర్యగా నోటీసు ఇస్తూ ఆ తర్వాత నిర్మాణానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఫలితంగా పిల్లర్‌తో మొదలై.. జీ+2 అంతస్తు వరకు వచ్చినా.. టౌన్ ప్లానింగ్ విభాగం కండ్లు మూసుకుంటున్నది. ఎల్బీనగర్ జోనల్ కేంద్రంగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే..
ఎల్బీనగర్ సర్కిల్ హస్తినాపురం డివిజన్ వెంకటేశ్వరకాలనీలోని జడ్పీ రోడ్ నం. 3లో ఇంటి నంబరు 8-7-98/84/వీ/22కు ఆనుకొని సర్వే నంబరు 58/1/ఏ (ఓల్డ్ నం 58)లో దాదాపు 123 గజాల స్థలంలో ప్రసన్నకుమార్ అనే వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. రోడ్డుకు 3 ఫీట్లు జరిగి జీ+2 నిర్మిస్తున్నా.. అటువైపు కన్నెత్తి చూడలేని దుస్థితిలో టౌన్ ప్లానింగ్ విభాగం ఉంది.
ఈ విషయమై కే. వేణుగోపాల్ అనే వ్యక్తి ఇప్పటికీ ప్రజావాణిలో ఐదు సార్లు ఫిర్యాదు చేసినా.. అనేకసార్లు టౌన్ ప్లానింగ్, జోనల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. లాభం లేకుండాపోయింది. కంటి తుడుపు చర్యగా 25 సెప్టెంబర్ 2024న లెటర్ నం 663/యూసీ/సీ4/ఎల్బీనగర్ నోటీసు జారీ చేశారే తప్ప.. నేటికీ అక్రమ నిర్మాణాన్ని కూల్చకపోవడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అవినీతి అధికారుల అండదండలతో యథేచ్ఛగా వరుసగా సెలవులను చూసుకొని నిర్మాణ పనులను పూర్తి చేసే పనిలో సదరు నిర్మాణదారుడు ఉండడం గమనార్హం. అనుమతి తీసుకొని చిన్న డివియేషన్ ఉంటేనే ముప్పుతిప్పలు పెట్టే అధికారులు.. నిర్మాణం అక్రమమని తెలిసినా.. చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.