సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : కాయ కష్టం చేసుకుని పైసా..పైసా కూడబెట్టి..ఇంటి కలను నెరవేర్చుకునేందుకు అనుమతి తీసుకుని ఇంటి నిర్మాణ పనులు మొదలు పెడితే.. వివాదాస్పద బిల్డర్ ఆ స్థలంపై కన్నేశాడు. కబ్జాకోరు, వివాదాస్పద బిల్డర్ అయిన సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ సరనాల శ్రీధర్‌రావు ఇందుకు రంగారెడ్డి జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యే సహకారం తీసుకొని బలవంతంగా లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నిర్మాణ జరుగుతున్న ప్లాట్‌లోకి అక్రమంగా చొరబడి, అందులో ఉన్న సామగ్రిని ధ్వంసం చేసి ప్లాటు కబ్జాకు యత్నించడంపై సదరు శ్రీధర్ రావుపై ఇటీవల గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.
అయినా వెనక్కి తగ్గకుండా శ్రీధర్, అధికార పార్టీ ఎమ్మెల్యేతో కలిసి అధికారులపై ఒత్తిడి పెంచి మరీ ఈ స్థలంలో నిర్మాణ పనులకు అడుగడుగునా అడ్డుతగులుతుండడం గమనార్హం. వాస్తవం ఏమిటంటే అధికారులు సైతం అక్రమార్కుడికి కొమ్ముకాస్తూ అమాయక నిర్మాణదారుడి స్థలంపై బుల్డోజర్లు దింపడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే…గచ్చిబౌలి ఎఫ్‌సీఐ ఎంప్లాయీస్ కాలనీ సర్వే నంబర్ 124,125, ప్లాట్ నంబర్ 84లోని 708 గజాల స్థలంలో వి. దేవరాజ్, వి. కల్యాణిల పేరుతో జీహెచ్ఎంసీకి నిర్మాణ అనుమతికి 2022లో దరఖాస్తు చేసుకున్నారు.
స్థలం డాక్యుమెంట్లు, పర్మిషన్‌కు సంబంధించి సిల్ట్ + 5 అంతస్తుల నిర్మాణానికి ప్లాన్ పరిశీలించి టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. పర్మిట్ నంబర్ 2046/జీహెచ్ఎంసీ/ఎస్ఎల్పీ/2022(ఫైల్ నం. 005050) పేరుతో ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ అనుమతి రాగానే సదరు నిర్మాణదారుడు దేవరాజ్ ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ ఎఫ్‌సీఐ కాలనీ హౌసింగ్ సొసైటీపై పెత్తనం చెలాయిస్తున్న బిల్డర్ శ్రీధర్ రావు బలవంతంగా దేవరాజ్ స్థలాన్ని తీసుకునే కుట్రకు తెరలేపాడు. దేవరాజ్‌ను పలు విధాల ఒత్తిళ్లు పెంచి మానసిక క్షోభకు గురి చేశాడు. అనేకసార్లు ప్లాట్‌లోకి చొరబడి నిర్మాణ సామగ్రికి చల్లాచెదురు చేశాడు.
ఈ నేపథ్యంలో గత నెల 27న శ్రీధర్ రావుపై దేవరాజ్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, వెంటనే కేసు నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ శ్రీధర్‌రావు వెనక్కి తగ్గకుండా గురువారం అధికార పార్టీ ఎమ్మెల్యే సహకారంతో శేరిలింగంపల్లి ముఖ్య అధికారులపై ఒత్తిడి పెంచి నిర్మాణ స్థలంలో ఫెన్సింగ్‌ను జేసీబీతో తొలగించారు. ఇదేక్కడి అన్యాయమని టౌన్‌ప్లానింగ్ అధికారులను నిర్మాణదారు డు దేవరాజ్ ప్రశ్నిస్తే స్థలం విషయంలో ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నారని, ఆ ఫిర్యాదు చేసిందెవరూ? దానికి వివరాలు ఇస్తానని, అనుమతి ఇచ్చిన మీరే పనులకు అడ్డు తగలడం ఏమిటని దేవరాజ్ మాటలకు అధికారుల నుంచి సమాధానం లేకపోవడం గమనార్హం.
మున్సిపల్ నిబంధనల ప్రకారం తనకున్న 708 గజాల స్థలానికి అనుమతిని పొందిన తర్వాత కూల్చివేయడంపై అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి నిర్మాణం అక్రమంగా చేపడితే ముందస్తుగా నోటీసులు ఇవ్వాలని అధికారులకు తెలియదా? ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు? అధికారులపై రాజకీయ పరమైన ఒత్తిడిలు ఉంటే అనుమతితో నిర్మాణం చేపడుతున్న వాటిపై చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? ఇంటి అనుమతులిచ్చేటప్పుడు పత్రాలను, స్థలాన్ని చూడకుండానే ఇచ్చారా? స్థలంపై వివాదం ఉంటే అనుమతి ఎందుకు ఇచ్చారు? తప్పు ఎవరు చేస్తే శిక్ష ఎవరికి వేస్తున్నారు? అధికారులు ఎందుకు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతున్నది.
పైసా పైసా పోగు చేసుకుని నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపడుతుంటే అధికారులు తరచూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అక్రమార్కులకు అండగా నిలుస్తూ తన స్థలాన్ని తనకు కాకుండా చేస్తున్నారని దేవరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎల్సీ, ఎల్ఆర్ఎస్, నిర్మాణ పర్మిషన్ కాపీలతో జీహెచ్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఇంటి పనులు మొదలు పెడితే కూల్చివేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
అనుమతి ఉన్నా ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నిస్తే ల్యాండ్ విషయంలో ఫిర్యాదు వచ్చిందని చెబుతున్నారే తప్ప.. అసలు ఫిర్యాదుదారుడి వివరాలు చెప్పమని ఆడిగితే అధికారులు ఎందుకు చెప్పడం లేదన్నారు. అనుమతి పత్రాలు వారికి చూపించినా.. అవేం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని మండిపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకు కుటుంబ సభ్యులతో కలిసి పోరాటం చేస్తానని, కమిషనర్ ఇలంబర్తి తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని దేవరాజ్ విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని సీపీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
– దేవరాజ్
సంధ్య కన్స్ట్రక్షన్స్ ఎండీ సరనాల శ్రీధర్‌రావు మీద గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలి సర్వే నంబర్ 124, 125లలోని ఎఫ్‌సీఐ కాలనీలో గల ప్లాట్ నంబర్ 84లో 700ల గజాల స్థలాన్ని గతకొన్ని సంవత్సరాల కిందట కొనుగోలు చేసిన ఉమా దేవరాజు అనే మహిళ, అప్పటి నుంచి పొజిషన్లో ఉండగా, అక్రమంగా ప్లాట్‌లోకి అక్రమంగా చొరబడి కబ్జా యత్నించినందుకు కేసు నమోదు చేశారు.
ఖాజాగూడ భగీరథమ్మ చెరువులో మట్టి డంపింగ్ చేసి చెరువును పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో రాయదుర్గం పోలీసులు శ్రీధర్‌రావుపై మరో కేసు నమోదు చేశారు. బాధితుడు దేవరాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు శ్రీధర్‌రావు, అతడి అనుచరులు వెంకటేశ్, సాయికుమార్రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 329/3, 324/4, 351/2, రెడ్‌విత్ 3,5ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.