హైదరాబాద్ : ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేయకపోతే కాంగ్రెస్ (Congress ) ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే (MLA) తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav) పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజీ ఎస్వీఐటీ(SVIT) ఆడిటోరియంలో నిర్వహించిన సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు.
కేవలం అధికారంలోకి రావాలనే ఆలోచనతో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Free Power) సరఫరా, రూ.4 వేల పెన్షన్ (Pension), ధాన్యానికి బోనస్ (Bonus) వంటి అనేక ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలు వాటిని అమలు చేయాలంటే వారి జీవితకాలం సమయం కూడా సరిపోదని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీ పై అర్ధరహితమైన విమర్శలు చేస్తూ హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ఈ సభకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మాజీ హోమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, దానం నాగేందర్, ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.