శామీర్‌పేట, డిసెంబర్ 27: రోడ్డు ప్రమాదాల నివారణకు తూంకుంట మున్సిపాలిటీ-ట్రాఫిక్ పోలీసులు సంయుక్త కార్యచరణ మొదలు పెట్టారు. అత్యంత ప్రమాదకరమైన స్థలాలను (బ్లాక్ స్పాట్స్)లను గుర్తించడంతో పాటు సూచిక బోర్డుల ఏర్పాటుకు శ్రీకారం చేట్టారు. అవసరమైన ప్రతి చోట సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. సంయుక్త కార్యాచరణతో రోడ్డు ప్రమాదాలకు పులిస్టాప్ పడనుంది. తూంకుంట మున్సిపాలిటీలో దొంగలమైసమ్మ -హకీంపేటరోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది.
తరచూ ప్రమాదాలతో ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేస్తుంది. కేవలం 6 నెలల్లోనే సుమారు 34 ప్రమాదాలు జరిగాయి. ఇప్పటికే 8 మంది ప్రాణాలను కోల్పోయారు. అందులో హకీంపేట, దేవరయాంజాల్ చౌరస్తా, బిట్స్ చౌరస్తాలు ప్రధాన స్థలాలు. అంతాయిపల్లిలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభంతో ఈ ప్రాంతం మరింత రద్దీగా మారింది. దీంతో బిట్స్ ఎక్స్‌రోడ్డు, కలెక్టరేట్ కార్యాలయం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన స్పాట్లుగా మారాయి.
సిగ్నల్స్ ఏర్పాటుకు చౌరస్తాలు గుర్తింపు
తూంకుంట మున్సిపాలిటీలోని రాజీవ్ రహదారిపై 4 స్థలాలు, బిట్స్ చౌరస్తా నుంచి అంతాయిపల్లి వరకు మరో రెండు స్థలాల్లో సిగ్నల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పటికే తూంకుంట మున్సిపాలిటీ-ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా సర్వే చేసి హకీంపేట, హకీంపేట ఫేజ్-2 కాలనీ, దేవరయాంజాల్ చౌరస్తా, మందాయిపల్లి చౌరస్తా, బిట్స్ చౌరస్తాలను గుర్తించారు.
సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి
రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే భయం కలుగుతుంది. తూంకుంట-హకీంపేట రోడ్డు మరిదారుణంగా మారింది. హకీంపేట, దేవరయాంజాల్ చౌరస్తాల్లో యాక్సిడెంట్ జరిగిందంటే ప్రాణాలు పోయిన ఘటనలే ఎక్కువ. హకీంపేటలో మొక్క జరిగిన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు చనిపోయారు. ఇప్పటికే పిల్లల పరిస్థితి విషమంగానే ఉంది. వీలైనంత త్వరగా సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలి. -రాజు, హకీంపేట.
బ్లాక్ స్పాట్లు గుర్తించాం
హకీంపేట నుంచి తూంకుం ట వరకు 4 బ్లాక్ స్పాట్స్ గుర్తిం చాం. ట్రాఫిక్ పోలీసులతో కలిసి త్వరలోనే సిగ్నల్స్ ఏర్పా టు చేస్తాం. ప్రతిపాదనలు పం పాం. త్వరలో సిగ్నల్స్ ఏర్పా టు చేస్తాం..
-కే.రాజేశ్వర్‌రావు, చైర్మన్ తూంకుంట మున్సిపాలిటీ.