సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ) : వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి, రైతులకు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాలపై ఆధారపడి జరిగే సాగుకు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. పంటల దిగుబడి, చీడ పీడలు, మట్టి స్వరూపం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేందుకు ఇక్రిసాట్ క్లెమేట్ స్మార్ట్ టెక్నాలజీకి రూపకల్పన చేస్తున్నది. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మొక్క వంగడాలను ఆవిష్కరిస్తుండగా..ఎలాంటి పర్యావరణ పరిస్థితులనైనా తట్టుకుని దిగుబడి వచ్చేలా కృషి చేస్తున్నది. మాలి దేశంలో ప్రయోగాత్మకంగా మెట్ట భూముల్లో సాగుకు అనుకూలమైన విధివిధానాలను అమలు చేస్తున్నది. సుస్థిర వ్యవసాయంతోనే ఆహార ఉత్పత్తుల కొరతను తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పర్యావరణ పరిస్థితులు సాగుకు ప్రతికూలంగా మారుతున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10-15శాతం పంటల దిగుబడి ప్రభావితం అవుతున్నట్లుగా తేలింది. మాలి ప్రభావిత ప్రాంతంగా ఉండటంతో..నూతన విధానాన్ని అమలు చేసేందుకు ఇక్రిసాట్ ఆ దేశాన్ని ఎంచుకున్నది. మాలి దేశంలోని నీటి ఎద్దడి సమస్యలకు పరిష్కారంగా డ్రీప్ ఇరిగేషన్, ఆధునిక సాగు విధానాలు, నూతన వంగడాలు, మేలి జాతి విత్తనాల వినియోగం వంటి అంశాల్లో అవగాహన కల్పించనున్నారు. స్థానిక వ్యవసాయ కమిటీలను సమన్వయం చేసుకుంటూ వాతావరణానికి అనుగుణంగా పంటల సాగు చేయనున్నారు. అదేవిధంగా కమ్యూనిటీ ఫార్మింగ్ను ప్రోత్సహిస్తూనే, మిల్లెట్ల ఉత్పత్తిని పెంచేలా ఇక్రిసాట్ టెక్నికల్ సాయం అందించనుంది.
మేలి రకం విత్తనాలతో సత్ఫలితాలు
ఆహార భద్రతను పెంచేలా ఇక్రిసాట్ కృషి చేస్తున్నది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దిగుబడిని పెంచడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నది. ఈ క్రమంలో మేలి రకం విత్తనాలతో సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నది. దీంతో వాతావరణ మార్పులతో కలిగే చీడ పీడలు, పంట నష్టాన్ని కూడా నివరించడానికి ఆస్కారం ఉంటుందని ఇక్రిసాట్ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా పంట మార్పిడి విధానాలతో మెట్ట భూముల్లో పోషకాల విలువ పెరిగి అధిక దిగుబడి పొందే వీలు ఉంటుంది. మాలి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలోనూ ఇదే తరహా విధానాలను అమలు చేసేందుకు ఈ అధ్యయనం సాయపడుతుందని ఇక్రిసాట్ పరిశోధకులు పేర్కొన్నారు.