Hyderabad | ఇక్ఫాయ్ (ICFAI) యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థినిపై యాసిడ్ దాడి కేసులో కొత్త ట్విస్ట్ బయటకొచ్చింది. స్నానం చేసే బకెట్లో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారని.. అవి రంగు నీళ్లుగా భావించిన విద్యార్థిని ఒంటిపై పోసుకోవడంతో తీవ్రగాయాలయ్యాయని గురువారం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, విద్యార్థినిపై యాసిడ్ దాడి జరగలేదని.. వేడి నీళ్ల కారణంగానే ఆమెకు గాయలయ్యాయని వర్సిటీ వీసీ గణేశ్ స్పష్టం చేశారు.
మే 15వ తేదీన సాయంత్రం తమ విద్యార్థినికి గాయాలయ్యాయని వీసీ గణేశ్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం 7.28 గంటలకు సాయంత్రం రూమ్‌లో నుంచి బయటకు వచ్చిన అమ్మాయి శరీరంపై బొబ్బలు వచ్చాయని చెప్పిందన్నారు. ఆమె చెప్పిన వెంటనే వర్సిటీలోనే ప్రథమ చికిత్స అందించామని చెప్పారు. ఆ సమయంలో ఒంటిపై 40 శాతం కాలిన గాయాలను గుర్తించామన్నారు. అందుకే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించామని చెప్పారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కేవలం వేడి నీళ్ల కారణంగానే ఆమె శరీరంపై బొబ్బలు వచ్చాయని.. యాసిడ్ దాడి జరగలేదని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించి కారిడార్‌లో సీసీటీవీ దృశ్యాలను కూడా పోలీసులకు అందించామని.. క్లూస్ టీం కూడా కొన్ని వస్తువులను తీసుకెళ్లారని చెప్పారు. హౌస్ కీపింగ్ వాళ్లు కూడా విద్యార్థులు ఉన్నప్పుడే గదిలోకి వెళ్తుంటారని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. అసలేం జరిగిందనేది వాళ్లే నిర్ధారిస్తారని తెలిపారు. బాధిత విద్యార్థిని తమ యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ లా చదువుతుందని వెల్లడించారు.
ఇక్ఫాయ్ యూనివర్సిటీలో విద్యార్థినిపై యాసిడ్ దాడి ఘటన నిన్న కలకలం సృష్టించింది. యువతి స్నానం చేసే బకెట్లో గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ పోశారని.. అది తెలియని విద్యార్థిని నీళ్లను ఒంటిపై పోసుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, హౌస్ కీపింగ్ సిబ్బంది ఫ్లోర్ క్లీన్ చేసేందుకు ఒక బకెట్లో యాసిడ్ కలిపారని.. ఫ్లోర్ శుభ్రం చేసిన అనంతరం బకెట్‌లోని నీళ్లను పారబోయకుండానే వెళ్లిపోయారని.. సరిగ్గా అదే సమయంలో స్నానానికి వచ్చిన విద్యార్థిని.. ఆ నీటిని ఒంటిపై పోసుకోవడంతో గాయాలైనట్లుగా భావిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. మరి ఇందులో ఏది నిజమో? ఏది అబద్దమో తెలియాల్సి ఉంది.