GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ కమిషనర్‌గా పనిచేస్తున్న ఇలంబర్తి స్థానంలో ప్రభుత్వం 2012 బ్యాచ్‌కు చెందిన ఆర్ వీ కర్ణన్‌కు బల్దియా బాధ్యతలు అప్పగించింది. ఆర్వీ కర్ణన్ కమిషనర్‌గా మంగళవారం బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీలో అప్పటికే సీనియర్ ఐఏఎస్ ఉండగా, జూనియన్ ఐఏఎస్‌కు కమిషనర్‌గా పోస్టింగ్ ఇవ్వడంతో ఈ వివాదం రాజుకున్నది. జీహెచ్ఎంసీలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి కిల్లు శివకుమార్ నాయుడు 2011 బ్యాచ్‌నకు చెందిన వారు. అంటే ఆర్వీ కర్ణన్ కంటే ఏడాది సీనియర్..ప్రభుత్వాలు జూనియర్..సీనియర్ అనేది పరిగణనలోకి తీసుకోకుండా పోస్టింగ్ ఇవ్వడంపై అధికార వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.
కనీసం శివ కుమార్ నాయుడును ఇక్కడి నుంచి మరో విభాగం సీనియర్ వద్దకు ప్రభుత్వం బదిలీ చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే శివకుమార్ నాయుడు సెలవులో వెళ్లడం ఉద్యోగుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవంగా ఐఏఎస్, ఐపీఎస్‌లలో సీనియర్, జూనియర్ అనే బేధాభిప్రాయాలు సహజంగానే ఉంటాయని, ఒకే చోట కలిసి పనిచేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఇలాంటివి బయట పడుతున్నాయని మరోసారి నిరూపితమైంది.
జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లలో హాట్ సీటు ఏదైన ఉంది అని అంటే శేరిలింగంపల్లి మాత్రమే…ఐటీ దిగ్గజ కంపెనీలు, ఆకాశహర్మాలు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో ఈ పోస్టింగ్‌పై చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే శేరిలింగపల్లి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపేందర్‌రెడ్డిని ఇటీవల ప్రభుత్వం హెచ్ఎండీఏ సెక్రటరీగా బదిలీ చేసింది.
ఈ బదిలీల్లో భాగంగానే జీహెచ్ఎంసీకి ఐఏఎస్ అధికారి హేమంత్ సహదేవ్ రావును ప్రభుత్వం నియమించింది. అయితే హేమంత్ సహదేవ్‌రావుతో పాటు ఇటీవల మెటర్నటీ లీవ్‌ను పూర్తి చేసుకుని తిరిగి జీహెచ్ఎంసీలో జాయినింగ్ లెటర్ ఇచ్చిన మరో ఐఏఎస్ అధికారిణి స్నేహ శబరీష్‌కు బల్దియాలో బాధ్యతలు అప్పజెప్పాల్సి ఉండగా, బుధవారం సాయంత్రం సహదేవ్ రావు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. స్నేహ శబరీష్ బాధ్యతలు ఖరారు కావాల్సి ఉంది.
రాష్ట్రంలోనే అత్యధిక జనాభా (సుమారు కోటి 20 లక్షల పైచిలుకు) అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పిందా? ప్రజల మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించిందా? అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందా? ఆంటే వరుసగా జరుగుతున్న ఐఏఎస్‌ల బదిలీలను చూస్తే అవుననే అంటున్నది గ్రేటర్ ప్రజానీకం. 16 నెలల కాంగ్రెస్ పాలనలో ముగ్గురు ఐఏఎస్‌లు రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి, ఇలంబర్తిలను మార్చేసి ముచ్చటగా నాలుగో ఐఏఎస్‌గా ఆర్ వీ కర్ణన్‌ను నియమించారు. సహజంగా ఇతర శాఖలతో పోల్చితే బల్దియాలో 24 గంటలు అప్రమత్తంగా ఉండి సేవలందించాల్సి ఉంటుంది.
ఆరు జోన్లలో ఆయా జోన్లకు అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వాస్తవంగా బల్దియా బాస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏ ఐఏఎస్‌కు అయినా.. జీహెచ్ఎంసీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని పట్టు సాధించాలంటే ఆరు నెలల సమయం తప్పనిసరి..రెండేండ్ల వరకు కొనసాగిస్తే శాఖ పటిష్టత, సంస్కరణలు చేసి పౌర సేవలను మెరుగుపర్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రజా పాలన ప్రభుత్వం 16 నెలల్లోనే ముగ్గురిని మార్చేసింది. కారణాలు ఏమైనా ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి చిత్త శుద్ధి లోపించిందన్న ఆరోపణలు లేకపోలేదు.
ఆర్ వీ కర్ణన్ బాధ్యత స్వీకరణ సందర్భంలో శివ కుమార్ నాయుడు హాజరు కాకపోవడంతో చర్చకు దారి తీసింది.మరో ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి సైతం సెలవు మీద వెళ్లడం, ఇందుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఇద్దరితో పాటు జోనల్ కమిషనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఇద్దరు ఐఏఎస్‌లో బల్దియాలో పనిచేసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్లు మాత్రం ఇతర శాఖలకు, కలెక్టర్లుగా వెళ్లాలన్న ప్రయత్నం చర్చ లేకపోలేదు. త్వరలో ప్రభుత్వం జరిపే కలెక్టర్ల బదిలీల్లో వీరి పేర్లు ఉంటాయన్న చర్చ కూడా మొదలైంది. ఉన్నట్టుండి బల్దియాను వీడుతుండడంతో ఇందుకు రాజకీయ ఒత్తిడిలు లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చకు జరుగుతున్నది.