Talasani Srinivas Yadav | తన జీవితకాలం పాటు జాతీయ, అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలకు హాజరయ్యే రెజ్లర్లకు అవసరమైన సహకారాన్ని అందిస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం తెలంగాణ భవన్లో నగరంలోని వ్యాయామశాలల నిర్వాహకులు, రెజ్లర్లతో తలసాని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. వ్యాయామశాలల అభివృద్ధికి, జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికైన రెజ్లర్లకు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
పోటీలకు హాజరయ్యే రెజ్లర్ల వెంట వెళ్లే కోచ్‌లకు కూడా అవసరమైన సహాకారాన్ని అందిస్తానని తెలిపారు. తాను ఏ ప్రయోజనాలను ఆశించి ఇంత పెద్ద సహకారం అందించడం లేదని, తనకు రెజ్లింగ్‌పై ఉన్న అభిమానంతో చేస్తున్నట్లు వివరించారు. అనంతరం ఈ నెల 24వ తేదీన అదేరోజు తెలంగాణ భవన్లో మోడల్ రెజ్లింగ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, పలువురు వ్యాయామశాలల నిర్వాహకులు, రెజ్లర్లు పాల్గొన్నారు.
