నేను ఇష్టపడుతున్న యువతిని నీవు పెండ్లి చేసుకోవద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తుండడంతో ఇరువర్గాల మధ్య గొడవకు దారితీసిన సంఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మణికొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇస్లామ్ అనే యువకుడికి ఇటీవల ఓ యువతితో పెళ్లి కుదిరింది. కాగా నౌషాద్ అనే వ్యక్తి పలుమార్లు ఇస్లామ్తోపాటు అతడి సోదరుడు నిజామ్ అలీకి ఫోన్లు చేస్తూ తాను ఇష్టపడుతున్న యువతిని పెండ్లి చేసుకోవద్దని, పెండ్లిని రద్దు చేసుకోవాలంటూ హెచ్చరిస్తున్నాడు.
తన దగ్గరికి వస్తే మరిన్ని విషయాలు చెబుతానంటూ అల్కాపూర్కు రావాలని సూచించాడు. దీంతో శుక్రవారం ఇస్లామ్ అక్కడికి వెళ్లగా నౌషాద్తో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే నీ సంగతి చూస్తానంటూ నౌషాద్ బెదిరించారు. అదే రోజు సాయంత్రం ఇదే విషయాన్ని గురించి ఓయూ కాలనీలోని సెలూన్లో పనిచేస్తున్న సోదరుడు నిజామ్ అలీకి చెప్పాడు.
దీంతో నిజామ్ అలీ, నాజిమ్లు సెలూన్ ముందు నిలబడి మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన నౌషాద్, షాదాబ్, అఫ్టల్తో పాటు మరికొంతమంది వారిద్దరిపై కర్రలతో దాడి చేశారు. బాధితుడు నిజామ్ అలీ ఫిర్యాదుతో ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.