బడంగ్పేట్: మూడు నెలలుగా తాము రెన్యువల్ చేసుకుంటామంటే చేసుకోనివ్వడం లేదని, సైట్ క్లోజ్ చేసి ఉంటున్నదని, మరోవైపు హైడ్రా అధికారులు తమకు నోటీసులు ఇవ్వకుండానే హోర్డింగులు తొలగిస్తూ తమ జీవనోపాధిపై దెబ్బకొడుతున్నారని తెలంగాణ ఔట్‌డోర్ మీడియా అసోసియేషన్ ఆరోపించింది. ఆదివారం బాలానగర్ చౌరస్తాలో హోర్డింగులు తొలగించే ప్రయత్నం చేసిన హైడ్రా అధికారులను అసోసియేషన్ ప్రతినిధులు అడ్డుకున్నారు. తమ దగ్గర అనుమతులు ఉన్నాయని, అయినా వాటిని ఎలా తొలగిస్తారంటూ నిలదీశారు.
హోర్డింగులు ఉన్న బిల్డింగ్‌ల్లోకి హైడ్రా సిబ్బంది రాకుండా తాళాలు వేశారు. మూడునెలల నుంచి సైట్ఎందుకు క్లోజ్ చేశారో చెప్పాలంటూ పలు యాడ్స్ ప్రతినిధులు హైడ్రా సీఐ రవికుమార్‌ను ప్రశ్నించారు. అనుమతులు లేనివి తీసేశారంటే తమకు అభ్యంతరం లేదని, కాదని అనుమతులు ఉన్నవాటిని కూడా ఎలా తీసేస్తారని వారు ప్రశ్నించారు. ఆదివారం హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆదివారమే కూల్చివేతలు చేపడుతున్న హైడ్రాపై తాము కోర్టుకు వెళ్తామని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు.