సిటీబ్యూరో: ఏండ్ల తరబడి ఒకే సర్కిల్లో పాతుకుపోయిన పట్టణ ప్రణాళికా విభాగం చైన్‌మన్లకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది. మాదాపూర్ కావూరిహిల్స్ ఫేస్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో ఓ వ్యాపారస్తుడు సెకండ్ హ్యాండ్ కార్ సేల్స్ వ్యాపారం కోసం అక్రమంగా షెడ్డు వేసుకోగా..ఆ వ్యాపారి నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు.. జోన్లో మిగతా చైన్మెన్లు అక్రమ నిర్మాణాల నుంచి అందినంద దండుకుంటున్నారన్న ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి చర్యలకు ఉపక్రమించారు.
కావూరి హిల్స్ ఫేస్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలం విషయంలో ఏర్పాటు చేసిన షెడ్డు వ్యవహారంపై డీసీ, ఏసీపీలతో విచారణ జరిపించిన జెడ్సీ సమూల ప్రక్షాళన చేశారు. శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా సర్కిళ్లలో పట్టణ ప్రణాళికా విభాగంలో పనిచేస్తున్న చైన్మన్లను బదిలీ చేస్తూ జోనల్ అధికారులు సోమవారం ఆదేశాలు చేశారు. శేరిలింగంపల్లి సర్కిల్లో పనిచేస్తున్న చైన్‌మన్‌లలో లక్ష్మీనారాయణను యూసుఫ్‌గూడ సర్కిల్‌కు , జావీద్‌ను చందానగర్ సర్కిల్‌కు, చందానగర్ సర్కిల్లో పని చేస్తున్న ఐలయ్య, కుమారస్వామిని పటాన్చెరు సర్కిల్‌కు, పటాన్చెరు సర్కిల్లో పని చేస్తున్న మల్లేశ్‌ను శేరిలింగంపల్లి సర్కిల్‌కు , రాజేందర్‌ను చందానగర్ సర్కిల్‌కు బదిలీ చేశారు.
చందానగర్ సర్కిల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్‌కుమార్‌ను పటాన్చెరు సర్కిల్‌కు బదిలీ చేయగా, వీరందరినీ తక్షణమే రిలీవ్ చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు.కొందరు చైన్మన్లు ఆయా స్థానాల్లో కేటాయించిన కొత్త సర్కిళ్లలో రిపోర్ట్ చేశారు. కాగా, కావూరి హిల్స్ ఫేస్- 2 రోడ్డులోని దాదాపు 1000 గజాల స్థలంలో అనుమతి లేకుండా షెడ్డు నిర్మాణం జరుగుతున్నది. సదరు నిర్మాణదారుడికి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు అందుకున్న సదరు యజమాని సోమవారం కూడా పనులు జరిపినట్లు తెలుస్తున్నది.