HYDRAA | సిటీబ్యూరో/తుర్కయంజాల్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ఓఆర్ఆర్ పరిధిలోని కొన్ని చెరువులు ఆక్రమణలతో మాయమైతే.. మరికొన్ని చెరువుల ఎఫ్టీఎల్ తూములను మూసేయడంతో పెరిగిందని, ఈ వ్యవహారంలో తమకు అనేక ఫిర్యాదులొస్తున్నాయని, రెండుమూడు నెలల్లో శాస్త్రీయ పద్ధతిలో చెరువుల హద్దులను నిర్ధారిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు, జిలావర్‌ఖాన్ చెరువుల హద్దులకు సంబంధించి ‘ప్రజావాణి’లో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో బుధవారం రంగనాథ్ తన బృందంతో కలిసి ఈ రెండు చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
చెరువుల తూములను మూసేసి అలుగు పెంచడంతో పైభాగంలో ఉన్న పంట పొలాలు, ఇండ్లు నీట మునుగుతున్నాయని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదులిచ్చారు. ఈ నేపథ్యంలో చెరువులను సందర్శించిన రంగనాథ్ స్థానికుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఎన్నార్ఎస్సీ ఇమేజీలు, గ్రామాలకు చెందిన మ్యాప్స్‌ను పరిశీలించి రెండు మూడునెలల్లో శాస్త్రీయ పద్ధతుల్లో మాసబ్‌చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తామని, ఆక్రమణలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
మాసబ్ చెరువును అనుకొని ఉన్న సర్వే నంబర్ 205లోని 12 ఎకరాల భూమికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదిత్యనగర్ కాలనీలోని నిర్మాణాలను పరిశీలించి కాలనీ వాసులతో మాట్లాడారు. మాసబ్ చెరువులోకి మురుగునీరు వచ్చి చేరుతున్నదని, ఆ నీరు కిందకు పోవడంలేదని వారు కమిషనర్‌కు చెప్పారు. ఈ చెరువుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించామని, వీటిపై ఇరిగేషన్ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులతో చర్చిస్తామని ఆ తర్వాత ఐఐటీ, బిట్స్ పిలాని, జేఎన్టీయూ విద్యాలయాల ఇంజినీరింగ్ నిపుణులతో అధ్యయనం చేయిస్తామని చెప్పారు.
తుర్కయాంజల్ చెరువు విస్తరణ 495 ఎకరాల్లో ఉందని, మొత్తం విస్తీర్ణం 522 ఎకరాలని.. ఇలా పలు రకాలుగా మ్యాపులు, రికార్డుల్లో ఉన్న లెక్కలను పరిగణనలోకి తీసుకుని ఒక నిర్ధారణకు వస్తామని తెలిపారు. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న సర్వే నెంబర్ 137లో చెరువు శిఖం భూమిని కబ్జా చేస్తూ వేసిన మట్టి రోడ్డును రంగనాథ్ పరిశీలించారు. అదే విధముగా జిలావర్ ఖాన్ చెరువును పరిశీలించిన ఆయన ఇంజాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. మాసబ్ చెరువు, జిలావర్ ఖాన్ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల సర్వే చేసి 3 నెలల్లో నిర్ధారణ చేస్తామని ఆయన తెలిపారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పాపయ్య, తహసీల్దార్ హేమ మాలిని, ఇరిగేషన్ డీఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ వంశీ, అబ్ధుల్లాపూర్‌మెట్ తాహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ అమరేందర్‌రెడ్డి, డీఈ భిక్షపతి, సర్వేయర్ జ్యోతి ఉన్నారు.
చెరువు ఎఫ్టీఎల్ పెరగడంతో తమ కాలనీలోకి నీళ్లు వస్తున్నాయని, తాము స్థలం తీసుకున్నప్పుడు ఈ సమస్య లేదని కాలనీ వాసి సరిత హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు చెప్పారు. తూములు తెరిచి తమ సమస్యను తీర్చాలని, అయితే ఈ సందర్భంలో హైడ్రా అంటే తమకు భయమైతున్నదని, తమ ఇండ్లను మాత్రం కూల్చొద్దంటూ కోరారు. చెరువులోకి చేరే మురుగునీరుతో తమకు సమస్యలు వస్తున్నాయని, తమ ఇండ్లల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా వస్తున్నదంటే తమ ఇండ్లకు ఏమవుతుందోనన్న భయం ఉందని, తూములు తెరిపించి నీరు కిందకు పోయేలా చేసి తమ ఇండ్లకు వరద ముప్పు లేకుండా చూడాలని ఆమె రంగనాథ్‌ను కోరారు.