సిటీబ్యూరో, ఏప్రిల్7(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ పూర్తయితే చాలా సమస్యలకు పరిష్కారం చూపినట్లవుతుందని, ఈ ప్రక్రియను వీలైనంత వరకు త్వరగా పూర్తిచేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం బుద్దభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారులకు వాటి పరిష్కార బాధ్యతలు అప్పగించారు.
మొత్తంగా 57 ఫిర్యాదులు అందాయి.సంబంధిత శాఖల నుంచి సేకరించిన సమాచారంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఎఫ్టీఎల్ నిర్ధారిస్తున్న సమయంలో ప్రజల అభ్యంతరాలను స్వీకరిస్తామని రంగనాథ్ తెలిపారు. ఎఫ్టీఎల్ నిర్ధారణకు ఉద్దేశించి లేక్ ఎన్యూమరేషన్ యాప్‌లో అభ్యంతరాలు చెప్పడానికి ప్రత్యేక కాలమ్ పెట్టాలని సూచించారు.
చెరువుల్లో ఓ వైపు నుంచి మట్టిని నింపడంతో పాటు మురుగునీరు నిరంతరంగా వచ్చిచేరడంతో ఎఫ్టీఎల్ పరిధులు మారిపోతున్న నేపథ్యంలో ఎఫ్టీఎల్ నిర్ధారణ వేగంగా జరగాల్సి ఉందని రంగనాథ్ చెప్పారు. గ్రామ, రెవెన్యూ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, సర్వే ఆఫ్ ఇండియా రికార్డులతో పాటు ఎన్ఆర్ఎస్సీ శాటిలైట్ ఇమేజ్‌లతో ఎఫ్టీఎల్ నిర్ధారణ జరుగుతోందన్నారు. ఎక్కువగా ఎఫ్టీఎల్లపై ఫిర్యాదులు రావడంతో ప్రత్యేకంగా నిపుణుల కమిటీని కూడా వేసి ఎలాంటి అపోహలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదుదారులకు వివరించారు.
ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఫిర్యాదులు..
వీటితో పాటు పలుకాలనీలకు మధ్య రహదారులకు ఆటంకాలు కలిగించడం, పాత లే అవుట్ల హద్దులను పట్టించుకోకుండా కబ్జా చేయడం, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను ప్లాట్లుగా చేసి అమ్మేయడం వంటి ఫిర్యాదులందాయని హైడ్రా అధికారులు చెప్పారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం మెట్టుకానిగూడ, గాజుల రామారం గ్రామంలో సర్వే నంబర్ 161లో ఉన్న పార్క్ స్థలంతో పాటు ఆ పక్కనే ప్రభుత్వ స్థలాన్ని కూడా కబ్జా చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
కాప్రా చెరువు ఎఫ్టీఎల్ నిర్ధారణ అయ్యిందని, ఫెన్సింగ్‌ను తొలగించి కొంతమంది అక్కడ చెరువులోకి వచ్చి కబ్జా చేస్తున్నారని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటహైరైజ్ పీవీఆర్ మెడోస్ వాళ్లు ఇతర కాలనీలకు వెళ్లే మార్గాలను మూసేశారని మల్లంపేట నివాసితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
పటాన్ చెరువులో తిమ్మక్క చెరువుకు నీరందించే పెద్దవాగును ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేసిందని, 30 మీటర్ల వెడల్పు వాగుకు తోడు ఇరువైపులా 9మీటర్ల చొప్పున బఫర్ ఉండాల్సిన విస్తీర్ణం కుంచించుకుపోయిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఉప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీ పార్వతీపురి గ్రామంలో 3 ఎకరాల సమాధుల భూమి తమదంటూ పట్టాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని మరో ఫిర్యాదు అందిందని హైడ్రా అధికారులు తెలిపారు.