అంబర్‌పేట: హైడ్రా కమిషనర్ రాజకీయ నాయకుల్లాగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఒక ఐపీఎస్ ఆఫీసరై ఉండి అబద్ధాలు మాట్లాడొచ్చా అని అంబర్‌పేట నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ అచ్చం దావూద్ ఇబ్రహీంలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బతుకమ్మకుంట స్థల వివాదంపై బుధవారం ఆయన ఛే నంబర్లోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. బతుకమ్మకుంట స్థలం ప్రభుత్వానిది కాదని, తనదని చెప్పారు.
ప్రైవేట్ స్థలంలోకి అక్రమంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఇతర అధికారులు, నాయకులు రావడాన్ని ఖండించారు. వారిపై అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రైవేటు వ్యక్తులతో తనకు కోర్టు కేసు నడుస్తున్నదని, ప్రభుత్వ అధికారులకు తన భూమిపై ఏం సంబంధమని ప్రశ్నించారు. ‘నన్ను హౌస్ అరెస్టు చేసి నా భూమిలోకి ప్రవేశించడం క్రిమినల్ చర్య’ అని పేర్కొన్నారు. ‘బతుకమ్మకుంట అసలు వాటర్ బాడీ కానే కాదు..ఇది పక్కా వేకెంట్ ల్యాండ్..గతంలో అనేక సార్లు ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను హైడ్రా కమిషనర్‌కు అందజేశా’..అని చెప్పారు.