Hyderabad | వెంగళరావునగర్, మే 24 : మంచి జాబ్ కోసమని అప్లై చేస్తే ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా ఒక్కొక్క ప్రక్రియను పూర్తి చేసుకుని ఆఫర్ లెటర్ అందుకుంటే.. జాబ్ కన్ఫార్మ్ కావాలంటే వివిధ భంగిమల్లో ఫొటోలు పంపించాలని మెయిల్ రావడంతో నిర్ఘాంతపోయింది. ఈ ఘటనపై సదరు యువతి హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం ఎల్లారెడ్డిగూడలోని ఓ హాస్టల్ ఉంటున్న ఓ యువతి(21) ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తుంది. గత నెల 21వ తేదీన తన క్లాస్మేట్ ఫోన్ చేసి విజయ్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీలో ఎలక్ట్రికల్ డిజైన్ ఇంజనీర్ జాబ్ పోస్టు ఖాళీగా ఉందని చెప్పి ఓ ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చాడు. క్లాస్మేట్ చెప్పాడని సదరు యువతి అదే రోజు తన రెజ్యూమ్నును పంపింది. రెండు రోజుల అనంతరం ఉద్యోగానికి సంబంధించిన వివరాలు, టెలిఫోన్ ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి ఆమెకు ఓ మెయిల్ రిప్లై వచ్చింది. ఇంటర్వ్యూ అనంతరం సర్టిఫికెట్స్ పంపించాలని మెయిల్ వచ్చింది. అది కూడా పూర్తయిన తర్వాత జాబ్‌కు సెలెక్ట్ అయ్యిందని చెప్పి సదరు యువతికి మే 1వ తేదీన ఆఫర్ లెటర్ మెయిల్లో వచ్చింది. ఆ ఆఫర్ లెటర్‌పై సంతకం చేసి తిరిగి పంపించిన తర్వాత మరో మెయిల్ కూడా వచ్చింది. అందులో వేర్వేరు భంగిమల్లో ఫొటోలతో పాటు నగ్న ఫొటోలు పంపమని, అలాగే శరీర కొలతలు చెప్పాలని ఆ మెయిల్లో ఉంది. దీంతో అనుమానం వచ్చి వారికి రిప్లయి ఇవ్వడం మానేసింది.
ఆ తర్వాత మరో జాబ్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో మే 3వ తేదీన నౌకరీడాట్‌కామ్ సహా తదితర వెబ్సైట్ల జాబ్ లిస్టింగ్స్‌లో తన పేరు సదరు యువతి గమనించింది. అలాగే ఉప్పల్‌లోని పవర్ ఎలక్ట్రికల్ కంపెనీలో ఇంటర్వ్యూ అంటూ ఫోన్ వచ్చింది. దీంతో ఉప్పల్‌కు వెళ్లి చూడగా.. అక్కడ ఆ పేరుతో కంపెనీ లేదని గుర్తించింది. ఇదంతా తన క్లాస్‌మెట్ వేసిన పన్నాగమని అనుమానంతో మధురానగర్ పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.