నగరంలో నీటి సమస్య రానున్న రోజుల్లో మరింత జటిలం కానుంది. ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. ఈనేపథ్యంలో జలమండలి సరఫరా సరిపోకపోవడంతో ట్యాంకర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నది. గతేడాది కంటే రెట్టింపు సంఖ్యలో ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో సింగూరు, మంజీరా, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే బోర్లు ఎండిపోయి ప్రజలు బిందెలు పట్టుకుని రోడ్డెక్కే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జలమండలి మంచినీటి బిల్లులను పెంచే యోచన చేస్తున్నదనే వార్త ఆందోళన కలిగిస్తున్నది. అందుకు మున్సిపల్ శాఖ తీసుకొచ్చిన నూతన క్యూర్ బిల్లు బలం చేకూరుస్తున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూర్ బిల్లులో నీటి బిల్లులు పెంచుకోవచ్చనే ప్రతిపాదనను జలమండలి ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. పరిస్థితిని బట్టి మంచినీరు, మురుగు నీటి నిర్వహణ బిల్లులను పెంచుకోవచ్చని క్యూర్ బిల్లులో స్పష్టంగా పేర్కొన్నారు. బిల్లుల పెంపుతో ఇప్పటికే లోటు బడ్జెటులో ఉన్న జలమండలికి కాస్త ఊరట కలిగించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో బిల్లుల పెంపు జరిగితే వినియోగాదారులపై మరింత భారం పడనుంది. నీటి బిల్లు కంటే ముందు సీవరేజి బిల్లు మాత్రం పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. సాధారణంగా నీటి బిల్లులోనే మురుగు నీటి నిర్వహణ చార్జీలు కలిపి వినియోగదారుడి నుంచి వసూలు చేస్తారు.
అధికారులు మురుగు నీటి నిర్వహణ చార్జీలను త్వరలోనే పెంచనున్నన్నారు. దీంతో నీటి బిల్లుల్లో కలిపి రావడం వల్ల సాంకేతికంగా బిల్లు పెరనుంది. ప్రస్తుతానికి ప్రతి నెలా మినిమం బిల్లు రూ.248గా ఉంది. మురుగు నీటి నిర్వహణ చార్జీలు పెంచితే మొత్తం బిల్లు రూ.300 నుంచి రూ.350 వరకు కానున్నట్లు తెలుస్తున్నది. ముందుగా మురుగు నిర్వహణ చార్జీలు పెంచి, జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యాక నీటి బిల్లు కూడా పెంచనున్నట్లు సమాచారం. వర్షాభావ పరిస్థితుల వల్ల నగరంలో అన్నింటి ధరలు పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మంచినీళ్ల బిల్లులు కూడా పెరిగితే సామాన్యుడికి మరింత భారం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజల జీవనం మరింత భారం అవుతున్నది. ఈనేపథ్యంలో నల్లా బిల్లుల పెంపుగా గుదిబండగా మారనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీటి బిల్లులు పెంచొద్దని నగర ప్రజలు కోరుతున్నారు.
విలీన ప్రాంతాలకు మరింత భారం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జలమండలి పరిధిలోని ప్రజలందరికీ 20 వేల లీటర్ల మంచినీళ్లను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత జలమండలిలో ఓఆర్ఆర్ లోపలి ప్రాంతాలన్నింటినీ కలిపారు. వాటితో పాటు గతేడాది మరికొన్ని ప్రాంతాలను కలుపుతూ మహా జలమండలిగా విస్తరించారు. కానీ విలీనం చేసిన ప్రాంతాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత తాగునీటి పథకాన్ని వర్తింపజేయడం లేదు.ఇప్పుడు బిల్లుల పెంచితేవారిపై మరింత భారం పడనుంది. ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయకుండా బిల్లుల పెంపు చేపడితే మూలుగుతున్న నక్క మీద తాటి పండు పడినంత పనవుతుంది. ప్రభుత్వం పునరాలోచించి విలీన గ్రామాలకు ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అంతేగానీ బిల్లులు పెంచి ఇబ్బందులు పెట్టొద్దని డిమాండ్ చేస్తున్నారు.