కొండాపూర్, జూలై 22 : తెలంగాణ రాష్ట్రం శాంతి భద్రతలకు నిలయమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. కొండాపూర్‌లోని 8వ పోలీసు బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విధుల పట్ల బాధ్యత, నైపుణ్యత, క్రమశిక్షణను కనబర్చాలని సూచించారు. వృద్ధులు, బడుగు బలహీన వర్గాలు, బాధితులకు మెరుగైన సేవలందించాలన్నారు.
మీరు నిర్వహించే విధులు, ప్రజలకు అందించే సేవలపైనే రాష్ట్ర పోలీసు శాఖ ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ప్రజలకు రక్షణ కరువై నక్సలిజం పెరిగిపోతుందన్న వారితోనే నేడు ప్రశంసలు పొందుతున్నామన్నారు. నిరంతరం నిఘా కోసం సీసీ కెమెరాలు, అధునాతన ఇంటిగ్రేటెడ్ పోలీసు క మాండ్ కంట్రోల్ సెంటర్ టవర్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. అనంతరం కొండాపూర్ పోలీసు బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకుని, పోలీసు కానిస్టేబుళ్లుగా సేవలందించేందుకు వెళ్తున్న 466 మందికి శుభాకాంక్షలు తెలిపారు.
కొవిడ్ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ శిక్షణ అందించిన 8వ బెటాలియన్ ప్రిన్సిపాల్ మురళీకృష్ణ, బెటాలియన్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వా రికి బహుమతులు అందజేశారు. కానిస్టేబుళ్లు ప్రదర్శించిన పలు ప్రదర్శనలను తిలకించారు. కార్యక్రమంలో అడిషనల్ డీజీపీ అభిలాష బిస్త్, డీఐజీ సిద్ధిఖీ, బెటాలియన్ కమాండెంట్లు, అధికారులు, సిబ్బంది, కానిస్టేబుళ్లు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పోలీసు శాఖలో విధులు నిర్వర్తించే ప్రతి ఒక్కరూ బాధ్యతను విస్మరించకూడదని శిక్షణా తరగతుల్లో తెలిపారు. జీవితకాలం బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకువస్తాను. ప్రతి ఒక్కరితో మర్యాదగా నడుచుకుంటూ నా విధులను నిర్విరామంగా కొనసాగిస్తూ ముందుకు సాగుతా. – బాబు, ఖమ్మం
ప్రజా రక్షణ వ్యవస్థలో పనిచేయాలని ఎంతో ఇష్టపడి పోలీసు శాఖలో చేరాను. ప్రిన్సిపాల్ సర్, ఉన్నత అధికారుల దిశా నిర్ధేశంలో విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యాను. విధి నిర్వహనలో అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖకు, తల్లిదండ్రులకు గొప్పపేరు తీసుకువస్తాను. – రమేశ్, మహబూబాబాద్
పోలీసు కావాలన్న కల నిజమైంది. ప్రజాసేవకై విధులకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. శిక్షణ సమయంలో అధికారులు సూచించిన సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తాను. విధులలో నిబద్ధతను పాటిస్తూ ముందుకుసాగుతా. పోలీసుశాఖ పేరు ప్రతిష్టలు పెంచేలా సేవలందిస్తాను. – శివ, ఖమ్మం
కానిస్టేబుల్ శిక్షణ సమయంలో ప్రిన్సిపాల్‌తో పాటు శిక్షణ అధికారులు విధులను నిర్వహించే విధానాలతో పాటు ఎదురయ్యే పరిస్థితులను తెలియజేశారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఏకాగ్రత, నిబద్ధత కోల్పోకుండా ముందుకువెళ్తూ.. ఉత్తమంగా నిలుస్తాను. ఎస్. సంపత్ కుమార్, జనగామ జిల్లా