మేడ్చల్, అక్టోబర్31(నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాలపై చేసిన వ్యాఖ్యలపై టీఎన్జీవో ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయాయన్న అనుచిత వ్యాఖ్యలపై బండి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. సోమవారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో టీఎన్జీవోస్ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రవి ప్రకాశ్ మాట్లాడుతూ… ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పదే పదే అవమానించడం బండి సంజయ్‌కు తగదన్నారు. రాజకీయాల కోసం ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఉద్యోగ సంఘాల బలం, ఐక్యత ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. నిరసనలో భాగంగా బండి సంజయ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంఘం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పి. ఈశ్వర్, ఉద్యోగ సంఘాల నాయకులు జేమ్స్, హరి, రవిందర్, రజిని, పద్మ, మారుతి, జెర్మియాస్ పాల్గొన్నారు.
ఆరోపణలు చేయడం సరికాదు..
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం చరిత్ర తెలుసుకొని బండి సంజయ్ నడుచుకోవాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ అన్నారు. సోమవారం టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్ ఇచ్చిన పిలుపు మేరకు నాంపల్లి గృహకల్పలోని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యాలయం నుంచి వివిధ యూనిట్లకు చెందిన వందలాది మంది ఉద్యోగులతో కలిసి టీఎన్జీవో కేంద్ర సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 75 సంవత్సరాల నుంచి ఉద్యోగుల శ్రేయస్సు కోసం నిర్విరామంగా పని చేస్తున్నదన్నారు. రాష్ట్ర ఉద్యోగులపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రం పరిధిలో ఉన్న సీపీఎస్ అంశాన్ని, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబుల పెంపు గురించి మాట్లాడాలని బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్‌కుమార్, ఉపాధ్యక్షులు కేఆర్ రాజ్‌కుమార్, కురాడి శ్రీనివాస్‌తో పాటు జిల్లా కార్యవర్గం, వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.
ఖబర్దార్ బండి సంజయ్..
సుమారు 75 ఏండ్లుగా ఉద్యోగుల సమస్యలే ప్రధానంగా కృషి చేస్తున్న టీఎనీ ్జవో సంఘంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీటీఎన్జీవో గచ్చిబౌలి హౌజింగ్ సొసైటీ అధ్యక్షుడు, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు డాక్టర్ ముత్యాల సత్యనారాయణ గౌడ్ మండిపడ్డారు. సోమవారం అబిడ్స్‌లోని సంఘం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… టీఎన్జీవో సంఘం, ఉద్యోగ సంఘం నాయకులపై ఆరోపణలు చేసే అర్హత బండి సంజయ్‌కు లేదన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాల నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తక్షణమే బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.