సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే హైదరాబాద్‌లోని కళాశాలలు, దానికి సమానమైన విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాల నిరోధక కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ తెలిపారు. కాలేజీలకు వచ్చే యువత ఆకర్షణకు లోనై, డ్రగ్స్ బారిన పడి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారని, దానిని క్షేత్ర స్థాయిలోనే కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కమిటీలలో విద్యార్థులు, ఫ్యాకల్టీలు ప్రాథమికంగా కనీసం ఐదుగురు సభ్యులుగా ఉంటూ బాధ్యతలు నిర్వహించాలని సీపీ సూచనలు చేశారు. పోలీసులు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం యాంటీ డ్రగ్ కమిటీలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్, వర్క్‌షాప్‌లు, సెమినార్లు ఏర్పాటు చేస్తూ మాదక ద్రవ్యాల వల్ల కలిగే ప్రమాదాల గూర్చి అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై విద్యార్థులలో అవగాహన కల్పించడానికి తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బంది, వివిధ ఏజెన్సీలు, పోలీసుల సహకారంతో ఆయా సంస్థల అధిపతులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీ సూచించారు. ఈ కమిటీలు మాదక ద్రవ్యాల వినియోగం, క్రయ, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని స్థానిక పోలీసులతో పాటు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (87126 61601, 040-27852080)కు సమాచారం ఇవ్వాలని సూచించారు.