461 మంది చిన్నారులకు వెట్టి నుంచి విముక్తి
బాలబాలికలను కాపాడిన ‘ఆపరేషన్ స్మైల్-8’
సిటీబ్యూరో, ఫిబ్రవరి 2(నమస్తే తెలంగాణ): ఆపరేషన్ స్మైల్-8 ద్వారా నెలరోజుల్లో 461 మంది బాలబాలికలను కాపాడారు. ఇందులో 214 మంది 18 రాష్ర్టాలకు చెందిన వారు ఉండగా, 247 మంది మన రాష్ర్టానికి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. కొందరికి కొవిడ్ సోకినా.. చాకిరీ చేయిస్తున్నట్లు తేలింది. అంతేకాకుండా అపరిశుభ్ర వాతావరణంలో పనిచేయిస్తున్నట్లు గుర్తించారు. ఇలా వారితో వెట్టిచాకిరీ చేయిస్తున్న మొత్తం 54 మందిపై కేసులు నమోదు చేశారు. కాపాడిన చిన్నారులను సంక్షేమ కేంద్రాలకు తరలించారు.
ఎవరి బిడ్డో..!
ఓ మహిళ వద్ద నుంచి కాపాడిన పసిపాపను తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ఆపరేషన్ స్మైల్ బృందం తీవ్రంగా కృషి చేస్తున్నది. నర్సాపూర్ గ్రామంలో ఉండే మహిళ.. 11 నెలల పాపను ఎత్తుకొని..భిక్షాటన చేస్తుండగా, ఆపరేషన్ స్మైల్ టీంలోని కానిస్టేబుల్ అనుమానించి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించాడు. పాపను శిశువిహార్‌కు తరలించి.. ఆ మహిళను విచారించారు. అయితే ఆ పాప తన బిడ్డ కాదంటూ…వేరే వారి వద్ద నుంచి తీసుకొచ్చానని చెప్పడంతో నోటీసు ఇచ్చి పంపించారు. ఆమె చెప్పిన వారిని ప్రశ్నించగా, వారు తమ బిడ్డ కాదని చెప్పడంతో సదరు మహిళ ఉంటున్న నర్సాపూర్ గ్రామానికి వెళ్లారు. అయితే ఆమె ఆచూకీ లభించలేదు.
ఆ మహిళ పసి పాపకు ఉదయం, రాత్రి కల్లు…తాగించి భిక్షాటన చేసేదని.. కొందరు పోలీసులకు చెప్పారు. డబ్బులు రాగానే పాపను ఏదైనా రోడ్డు పక్కన లేదా దేవాలయం వద్ద వదిలేసి వెళ్లిపోయేదన్నారు. కాగా, ఆమె పసిబిడ్డను కిడ్నాప్ చేసిందా…లేదా ఎవరి వద్ద నుంచైనా ఎత్తుకొచ్చిందా… ఇంకా ఎవరైనా భిక్షాటనలో వచ్చే డబ్బుల్లో భాగస్వామ్యం కోసం బిడ్డను ఆమెకు ఇచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాపను తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.