సిటీబ్యూరో, మార్చ్ 26(నమస్తే తెలంగాణ): రైల్వేలలో భద్రత పెంచుతున్నామని, లేడీస్ కోచ్‌లలో సీసీ కెమెరాలు పెట్టాలని ప్రతిపాదనలు పంపినట్లు రైల్వే ఎస్పీ చందనా దీప్తి అన్నారు. ఎంఎంటీఎస్ ఘటనలో దర్యాప్తును వేగవంతం చేశామని సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకట్రెండు రోజుల్లో వివరిస్తామని వెల్లడించారు. రైల్వేలలో మహిళల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై నమస్తే తెలంగాణతో చందనాదీప్తి మాట్లాడారు.
లేడీస్ కోచ్‌లోనే కూర్చోండి
ఒంటరిగా ఉన్నప్పుడు మహిళలు లేడీస్కోచ్లోనే కూర్చోవాలని ఎస్పీ చందనాదీప్తి సూచించారు. ఈ కోచ్ గార్డ్ దగ్గరే ఉంటుంది కాబట్టి ఏదైనా సమస్య వస్తే అలారమ్ మోగిస్తే అది విని గార్డు వెంటనే అప్రమత్తమవుతారని చెప్పారు. మహిళల కోచ్‌లో మహిళలు కాని వారెక్కినా, అనుమానితులు ఎక్కినా వెంటనే రైల్వే సిబ్బందికి తెలపాలని తెలిపారు. గతంలో లేడీస్ కోచ్‌లో ఎక్కేందుకు ఓ వికలాంగుడికి అవకాశమిస్తే అతడు మహిళలను హత్య చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎస్పీ గుర్తు చేశారు.
రైల్వే ప్రయాణంలో మహిళలకు ఏవైనా ఇబ్బందులు వస్తే వెంటనే 139కి కాల్ చేయాలని ఆమె సూచించారు. రైల్వే స్టేషన్లలో ఆర్పీఎఫ్, జీఆర్పీలు పెట్రోలింగ్‌లో ఉంటారని, కాల్ చేసిన 10 నిముషాల్లో సంఘటనాస్థలానికి చేరుకుని వారిని రక్షిస్తారని ఆమె భరోసా ఇచ్చారు. అయితే రైల్వే స్టేషన్లలో కూడా మహిళల పట్ల కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని, ఒక్క రైల్వే పోలీసులకే కాకుండా అక్కడున్న రైల్వే సిబ్బందికి కూడా ఫిర్యాదు చేయవచ్చని ఎస్పీ తెలిపారు.
మహిళల భద్రత-భరోసా విషయంలో ప్రత్యేక క్యాంపెయిన్లు చేస్తున్నామని, వేసవికాలంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయని, ముఖ్యంగా రైలులో ప్రయాణించేసమయంలో కిటికీల దగ్గర కూర్చోవద్దని, మహిళలు నగలు వేసుకుని కూర్చొని ఆదమరిస్తే దొంగతనాలు జరిగే అవకాశముంటుందని తెలిపారు. మహిళా కోచ్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తామని చందనాదీప్తి పేర్కొన్నారు.
సెల్ఫీ కూడా కారణమా?
ఎంఎంటీఎస్ ఘటనకు సంబంధించి తమకు కొన్ని అనుమానాలున్నాయని ఎస్పీ చందనాదీప్తి చెప్పారు. అనుమానితుడు మద్యంమత్తులో ఉంటున్నాడని, అతనికి ఫోన్ కూడా లేదని తెలిపారు. ఆ రోజు ఎంఎంటీఎస్ రైలులో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అసలేం జరిగి ఉంటుందన్న విషయంపై ఓ కొలిక్కి రాలేకపోతున్నామని ఆమె తెలిపారు. బాధితురాలు చికిత్స పొందుతున్నది ఆమె ఇంకా మగత లో నుంచి పూర్తిగా బయటికి రాలేదని చెప్పారు.
ఫలానా వ్యక్తే అనుమానితుడంటూ బాధితురాలు చెబుతున్నది కానీ.. అనుమానితుడు అతడేనా అనే విషయాన్ని ఖరారు చేయలేకపోతున్నామంటూ వెల్లడించారు. బాధితురాలికి డేంజరస్ సెల్పీలు దిగే అలవాటున్నట్లుగా తమ దర్యాప్తులో తెలిసిందని, ఆ కోణంలోనూ విచారణ జరుపుతున్నామని చందనాదీప్తి వెల్లడించారు.