ఎల్బీనగర్, అక్టోబర్ 9: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చింతలకుంట ప్రాంతంలో ఓ వ్యక్తి నాలాలో గల్లంతయ్యాడన్న వార్తతో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు హైరానా పడ్డారు. అయితే సదరు వ్యక్తి సురక్షితంగా ఉన్నాడని తేలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సరూర్‌నగర్ చెరువు దిగువ ప్రాంతమైన గడ్డిఅన్నారం డివిజన్లో వరద తీవ్రతకు రోడ్లపై వరదనీరు పోటెత్తింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని శివగంగా థియేటర్ ప్రహరీ కూలిపోయింది. సినిమా చూసేందుకు వచ్చినవారు పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. శివ థియేటర్లోకి వరదనీరు పోటెత్తింది.
గడ్డిఅన్నారం డివిజన్ కోదండరాంనగర్, వివేకానందనగర్, కమలానగర్ ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపై పోటెత్తింది. జీహెచ్ఎంసీలోనే లింగోజిగూడ ప్రాంతంలో అత్యధిక వర్షాపాతం నమోదయ్యింది. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం మరోమారు వర్షం దంచికొట్టింది. దీంతో వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. నాగోలు ప్రధాన ఇన్నర్ రింగ్‌రోడ్డుపై, మోహన్‌నగర్ న్యూ నాగోలు కాలనీ దారిలో విషాల్ మార్ట్ వద్ద, బీఎన్‌రెడ్డినగర్‌లోని లోతట్టు ప్రాంతాలతో పాటుగా పలు డివిజన్ల పరిధిలో ప్రజలు భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాలతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ యంత్రాంగం వరదముంపు ప్రాంతాల్లో వరదనీరు వెళ్లేలా తగు చర్యలు తీసుకున్నారు.
నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలు శుక్రవారం రాత్రి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి 10 గంటల సమయంలో గడ్డిఅన్నారం డివిజన్లోని కోదండరాంనగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన మేయర్, ఎమ్మెల్యే, మధ్యరాత్రి 12 గంటలకు చింతలకుంట చెక్‌పోస్టు ప్రాంతంలో ఓ వ్యక్తి గల్లంతు అయ్యాడన్న సమాచారంతో అక్కడి నాలాలను పరిశీలించారు. అనంతరం రాత్రి 12.30 గంటలకు చంపాపేట డివిజన్లోని పవన్పురికాలనీ పరిసర ప్రాంతాలు, రాత్రి 1 గంటకు లింగోజిగూడ డివిజన్ గ్రీన్‌పార్కు కాలనీ పరిసర ప్రాంతాలు, రాత్రి 1.30 గంటలకు బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని గాంధీనగర్, స్నేహమయినగర్, పీవీఆర్కాలనీ, బ్యాంక్‌కాలనీ, హరిహరపురం, గాయత్రినగర్, క్రిస్టల్విల్లాస్ తదితర ప్రాంతాలలో తిరుగుతూ తెల్లవారుజాము 3 గంటల వరకు పర్యటించారు.
హయత్‌నగర్, అక్టోబర్ 9 : ఇటీవల కురుస్తున్న వర్షాలకు హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలు జలమయంగా మారాయి. డివిజన్ పరిధిలోని బంజారాకాలనీ, అంబేద్కర్‌నగర్, రంగనాయకులగుట్ట కాలనీల్లో ఎల్బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ ఉపేందర్‌రెడ్డి, హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, స్థానిక కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డితో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపునకు గురైన బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించి భోజన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
డివిజన్ పరిధిలోని ముంపునకు గురైన కాలనీల్లో మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్‌గౌడ్‌తో కలిసి ముంపునకు గురైన కాలనీల్లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంటా టీఆర్ఎస్ హయత్‌నగర్ డివిజన్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు బానోతు దేవరాం, మెగావత్ గోవర్దన్ నాయక్, ప్రవీణ్ నాయక్, తదితరులు ఉన్నారు.