కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. వానాకాలంలో గ్రేటర్ వ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. దానికి తోడు ఎండలు మండిపోతున్నాయి. సెప్టెంబర్ నుంచే ఉష్ణోగ్రత 35 డిగ్రీలకు చేరువగా నమోదవుతున్నది. నగరంలో పరిస్థితులు ఎండాకాలాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితులతో బోర్లన్నీ ఎండిపోతున్నాయి. నగరంలోని ప్రతి ప్రాంతంలో రెండు వేల కంటే ఎక్కువ లోతులో బోర్లు వేసినా చుక్క నీరు పడని దుస్థితి నెలకొన్నది.
ఇండ్లలో బోర్లు వట్టిపోయి నీళ్లు అందక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నల్లా నీటి సరఫరా అరకొరగా ఉండటం, లోప్రెషర్ సమస్యలు వేధిస్తుండటంతో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న ట్యాంకర్లకు డిమాండ్ అమాంతం పెరుగుతున్నది. మెజారిటీ ఫిల్లింగ్ స్టేషన్లలో ట్యాంకర్లు కిటకిటలాడుతున్నాయి. రోజురోజుకు బుకింగ్స్ రెట్టింపు సంఖ్యలో నమోదవుతున్నాయి. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, రాజేంద్రనగర్ మండలాల్లోని మెజారిటీ ప్రాంతాల్లోని కాలనీలు ట్యాంకర్ల మీదనే ఆధారపడుతున్నాయి.
-సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ)
సిటీ బ్యూరో, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ట్యాంకర్ల డిమాండ్ మునుపెన్నడూ లేనివిధంగా ఎండాకాలాన్ని తలపించేలా రికార్డుస్థాయిలో బుక్ అవుతున్నాయి. సోమవారం నాటికి ఏకంగా 6,514 ట్యాంకర్లు బుకింగ్ అయ్యాయి. ఇంత మొత్తంలో గతంలో ఎన్నడూ జరగలేదని జలమండలి అధికారులు చెప్తున్నారు. గతేడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి అక్టోబర్ నెల దాకా 3000-4000 వరకు కూడా బుక్ అయిన దాఖలాలు లేవు. కానీ ఈసారి అంతకంటే రెట్టింపులో బుకిం గ్స్ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బస్తీలు, కాలనీల్లో జలమండలి నీళ్లు చాలినంత సరఫరా కాకపోవడం కూడా బుకింగ్స్ పెరగడానికి కారణంగా తెలుస్తున్నది.
ముఖ్యంగా కొండాపూర్, మాదాపూర్, లింగంపల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మణికొండ, హైటెక్‌సిటీ, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్, నారపల్లి, మేడిపల్లి వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరిం త దారుణంగా ఉన్నట్లు తెలుస్తున్నది. నీటి ఎద్దడి ఎక్కువ ప్రాంతాల్లో ట్యాంకర్ల యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఓ ట్యాంకర్ యజమాని డొమెస్టిక్ బుకింగ్ చేసిన నీళ్లను అక్రమంగా అమ్ముకుంటుండటంతో విజిలెన్స్ సిబ్బంది పట్టుకుని రూ.30 వేలు జరిమానా కూడా విధించినట్లు సమాచారం. ట్యాంకర్ల డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో జలమండలి అధికారులు నీటిని పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అక్టోబర్ తొలి వారం నుంచే ట్యాంకర్స్ బుకింగ్స్ ఎండాకాలం లాగా 7 వేలకు చేరువ అవుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. నీటి ఎద్దడి పరిస్థితుల దృష్ట్యా జలమండలి అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ట్యాంకర్స్ సరఫరా, అక్రమ తరలింపులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. నీటి సరఫరాలోనూ అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోకుంటే బస్తీలు, పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే కాలనీలకు నీళ్లు అందక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. సైబర్ సిటీలో జలమండలి నీళ్లు కమర్షియల్ భవనాలు, హైరైజ్డ్ భవన సముదాయాలకు అక్రమంగా సరఫరా కాకుండా నిరంతంర నిఘా ఉంచాలి. విజిలెన్స్, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రతమత్తం చేస్తూ ప్రజలకు నీటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీటి చౌర్యానికి పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాది ఆగస్టు నెలలో యావరేజిగా 6.36 మీటర్ల దిగువన ఉన్నాయి. ఈ ఏడాది దాదాపు 5 మీటర్ల దిగువకు పడిపోయి 11.20 మీటర్ల కిందికి చేరుకున్నాయి. గతంతో పోలిస్తే నేరుగా 5 మీటర్లు దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి అని భూగర్భ శాస్త్ర నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతం, వాయవ్యం, తూర్పు ప్రాంతాలు, రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో ఎక్కువగా దిగువకు చేరుకున్నాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి పరిసరాల్లో భూగర్భ జలాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి.
ఈ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పెరుగుతుండంతో అంతే వేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. కుత్బుల్లాపూర్‌లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా 39.89 మీటర్ల కింద పాతాళానికి పడిపోయాయి. గతేడాది తిరుమలగిరి ప్రాంతంలో 14.15 మీటర్ల లోతులో ఉంటే ఈఏడాది అది రెట్టింపై 27.74 మీటర్లకు పడిపోయింది. ఇది ప్రతి ఏటా 13.73 నుంచి 17.68 మీటర్లుగా నమోదవుతున్నది. మారేడ్‌పల్లిలో భూగర్భ జలాలు 12.97 మీటర్ల దిగువకు చేరుకున్నాయి. శేరిలింగంపల్లి, మేడిపల్లి, మేడ్చల్, ఉప్పల్, కూకట్‌పల్లితో పాటు హఫీజ్‌పేటలో రికార్డు స్థాయిలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి.