సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 20: గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు పేషీకి హాజరయ్యేందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి.. మూడో అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి ఇన్స్పెక్టర్ అభిలాష్ కథనం ప్రకారం.. మాసబ్‌ట్యాంక్ ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ సలీముద్దీన్ (27 ) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 2022లో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు.
ఈ కేసు విచారణ నాంపల్లి క్రిమినల్ కోర్టులో జరుగుతోంది. కేసు విచారణ ఉండటంతో బుధవారం నాంపల్లి క్రిమినల్ కోర్టుకు వచ్చాడు. కోర్టు భవనం మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. పోలీసులు గమనించి వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. సలీముద్దీన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు విచారణలో ఉన్నదని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.