సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): పోలీస్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుపేద నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనరేట్ అధికారులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పోలీస్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు జరిగాయి. పోటీ పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులకు అప్పట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఐదు జోన్లతో పాటు మహిళల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో జోన్లో పేద, మధ్య తరగతి నిరుద్యోగ యువతను ఎంపిక చేసి.. వారికి నోటిఫికేషన్ నుంచి పరీక్షలు ముగిసే వరకు ఉచిత శిక్షణ అందించారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌పై కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ప్రతి జోన్‌కు వెయ్యి మంది చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయగా, యువతకు దిల్‌సుఖ్‌నగర్‌లోని భాగ్యరేఖ ఇనిస్టిట్యూట్ సహకారంతో తర్ఫీదునిచ్చారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో 50 శాతం వరకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తాజాగా సీఎం కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేయడంతో పోలీస్ శాఖ మళ్లీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.
దళారుల మాటలు నమ్మొద్దు..
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రాగానే తాము ఉద్యోగాలిప్పిస్తామంటూ.. కొందరు దళారులు యువతను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి మాటలు ఎవరూ నమ్మొద్దు. ఉద్యోగాల నియామకాలు ప్రతిభ ఆధారంగా వస్తాయి. ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు నిర్వహిస్తుంది. దళారుల సమాచారం ఉంటే పోలీసులకు తెలుపండి. పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే యువతకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా తయారు చేస్తాం. – సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
సద్వినియోగం చేసుకోండి…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటనను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి. పోలీసు శాఖలో 18334 పోస్టులు భర్తీ కానున్నాయి. డీసీపీ జోన్ల వారీగా ఉచిత శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తాం. ప్రతిభ కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తాం. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని మీ మధ్య తిరుగుతుంటే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ 9490617444కు సమాచారం ఇవ్వాలి.
– స్టీఫెన్ రవీంద్ర , సైబరాబాద్ సీపీ
ప్రజా సేవకు మంచి అవకాశం..
నిజాయతీగా, నిబద్ధతతో ప్రజా సేవ చేయాలనుకున్న యువతకు ఇది మంచి అవకాశం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ పోలీసులకు లేని జీతాలు, సౌకర్యాలు కేవలం తెలంగాణలోనే ఉన్నాయి. పోలీసు శాఖలో చేరాలనుకుని కలలు కనే వారు ఈ నియమకాలను సద్వినియోగం చేసుకోవాలి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక ప్రీ-రిక్రూట్మెంట్లను నిర్వహించి అర్హత ఉన్న అభ్యర్థులు, యువతీయువకులకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం.
– సుధీర్‌బాబు,అదనపు సీపీ