సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రణాళికా బద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతున్నది. అటవీ ప్రాంతాలను అర్బన్ఫారెస్ట్ బ్లాకులుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. తాజాగా ఓ కొత్త కార్యక్రమానికి హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. రియల్ ఎస్టేట్ సంస్థలు గతంలో హెచ్ఎండీఏ అనుమతితో చేపట్టిన లేఅవుట్లలో 10 శాతం స్థలం పార్కుల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఆ స్థలాలను గుర్తించాలని నిర్ణయించారు.
శివారు మున్సిపాలిటీలతో కలిసి పార్కు స్థలాల పరిరక్షణ..
జీహెచ్ఎంసీ పరిధిని మినహాయిస్తే హెచ్ఎండీఏ పరిధిలో 40 వరకు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రేటర్ చుట్టూ ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో పరిపాలనపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అభివృద్ధి కార్యక్రమాలతో ఇంటి పన్నుల వసూలు, శానిటేషన్,్ర గీనరీని పెంచడం.. తదితర కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ మున్సిపాలిటీల పరిధిలోనే పెద్ద సంఖ్యలో లే అవుట్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే కొత్తగా కాలనీలు వస్తున్న నేపథ్యంలో పాత లే అవుట్లను పరిశీలించి, అందులో 10 శాతం మేర పార్కుల కోసం కేటాయించిన స్థలాలు గుర్తించాలని నిర్ణయించారు. వాటి చుట్టూ రక్షణగా ఫెన్సింగ్ ఏర్పాటుచేసి జూన్లో చేపట్టే హరిత హారంలో మొక్కలు నాటాలని హెచ్ఎండీఏ అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది సుమారు 500 పార్కుల స్థలాలను గుర్తించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటి పరిరక్షణ కోసం శాశ్వతంగా ప్రహరీ నిర్మించనున్నారు. కేవలం హెచ్ఎండీఏ అధికారులే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీల అధికారులతో కలిసి పార్కుల స్థలాల పరిరక్షణకు చర్యలు చేపట్టనున్నారు.
హెచ్ఎండీఏ స్వరూపం..
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో 40 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, 719 గ్రామాలు ఉన్నాయి. ఇప్పటికే 7 జిల్లాల పరిధిలోనే అనుమతి పొందిన లే అవుట్లు 12,000లకు పైగానే ఉన్నాయి. కొత్తగా మరిన్ని ఏర్పాటవుతూనే ఉన్నాయి. వీటికి తోడు ఔటర్ రింగ్ రోడ్డు బయట కొత్తగా పదుల సంఖ్యలో పారిశ్రామిక వాడలు వందల ఎకరాల్లో ఏర్పాటవుతున్నాయి. దీంతో చుట్టూ 50 కి.మీ. వరకు ఉన్న హెచ్ఎండీఏ పరిధిలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేందుకు అవసరమైన అంశాలను ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నారు.