సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్‌లోని కాలనీల్లో వంద శాతం గ్రీనరీ లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాల మేరకు నగర వ్యాప్తంగా 4,846 కాలనీలను గుర్తించిన జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారులు 8వ విడత హరితహారంలో కాలనీ గ్రీనరీకి పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం ప్రస్తుత సంవత్సరం హరితహార లక్ష్యంపై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ సోమేశ్‌కుమార్ దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కాలనీలు నిండు పచ్చదనంతో కళకళలాడాలని అధికారులను ఆదేశించారు. 8వ విడత హరితహారం కార్యక్రమంలో కోటి 25 లక్షల మొక్కలే లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో 3వేల కాలనీలను వంద శాతం గ్రీనరీగా మలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో కాలనీని యూనిట్‌గా తీసుకుని, ఆ కాలనీలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా ఫ్రూట్స్, ఫ్లవరింగ్ మొక్కలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికల్లా ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, ఇనిస్టిట్యూషన్స్, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నారు.
160 కి.మీ. మేర మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్
ఈ ఏడాది కూడా ప్రధాన రహదారుల వెంబడి నాటుతున్న మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నారు. గత ఏడాది మియాపూర్ బస్‌డిపో, బీకే ఎన్క్లేవ్ రోడ్, రాందేవ్ గూడ నుంచి నెక్నాంపూర్ రోడ్, మల్కాజిగిరి సర్కిల్లోని జెడ్‌టీసీ నుంచి ఎన్ఎఫ్సీ వరకు, అరాంఘర్ చౌరస్తా నుంచి శంషాబాద్ వరకు ఈ ప్లాంటేషన్‌ను చేపట్టారు. రహదారులకు ఇరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో తీగ జాతి కాగితం పూల మొక్కలు, పూల పొదల మొక్కలు మొదటి వరుసలో, ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, బిజ్జోనియా మెగాఫోటమికా జాతి మొక్కలు, చివరి వరుసల్లో ఏపుగా పెరిగి నీడనిచ్చే వేప, రావి, మర్రి తదితర చెట్లను నాటడం ద్వారా రహదారులు చూడముచ్చటగా మారాయి. ఆయా మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు ఈ మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ కనువిందుగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మరో 160 కిలోమీటర్ల మేరలో ఈ మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టనున్నారు. వీటితో పాటు చెరువుల సుందరీకరణ పనులు కూడా చేపట్టారు.185 చెరువుల్లో 18 చెరువుల వద్ద గ్రీనరీ పనులు చేపట్టగా.. మిగిలిన చెరువుల వద్ద ఈ ఏడాది పచ్చదనం పెంపొందించనున్నారు.