హైదరాబాద్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ): ఆదాయం పెంపు మార్గాలపై ఆర్టీసీ ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. నగర విస్తరణతో శివారు ప్రాంతాల్లో ఏర్పడుతున్న గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, డబుల్ బెడ్రూం ఇండ్లు పెరుగుతున్న ప్రాంతాల నుంచి ప్రధాన రూట్ల వరకు బస్సు సదుపాయం లేదు. చాలా వరకు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. ఈ గ్యాప్‌ను తగ్గించేలా ప్రయాణికులకు వారి కాలనీల వరకు కొన్ని ప్రత్యేక ఫీడర్ బస్సులను అందుబాటులోకి తేవాలన్న యోచనలో ఆర్టీసీ ఉంది. ఈ బస్సులు ఆయా మార్గాల్లోని ప్రధాన పాయింట్ల వద్దకు ప్రయాణికులను చేర్చుతాయి. దీని వల్ల ప్రజలకు మరింత మెరుగైన, సురక్షితమైన రవాణా సదుపాయంతో పాటు ప్రైవేటు వాహనదారులు అడ్డగోలు రేట్లు తీసుకోకుండా క్రమబద్ధీకరించినట్లు అవుతుందని, ఇది ప్రధానంగా ప్రజలకు మరింత చేరవయ్యే ఆలోచనలో భాగమేనని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత విస్తరిస్తామని పేర్కొన్నారు.
కాల్ చేయండి.. వివరాలు తెలుసుకోండి
రేపటి నుంచి ఆర్టీసీ నూతన కాల్ సెంటర్ సేవలు
టీఎస్ ఆర్టీసీ బస్సు సేవలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయాణికులకు నూతన కాల్ సెంటర్‌ను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. 040-6944 0000, 040-2345 0033 నంబర్లను మే 1 నుంచి అందుబాటులోకి తేనున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ బస్ భవన్ నుంచి నిర్వహించనున్న ఈ కాల్ సెంటర్లో ప్రయాణికులకు విహార యాత్రలు, పెండ్లీలకు అద్దె వివరాలు, అన్ని రకాల బస్సు పాసులు, బస్ రిజర్వేషన్, రిజర్వేషన్ రద్దు సేవలతో పాటు బస్సు సేవలు మెరుగుపర్చేందుకు సలహాలు, సూచనలు సైతం ఈ నంబర్లలో కాల్ చేసి తెలియజేవచ్చని వారు సూచించారు.