జీడిమెట్ల, ఏప్రిల్ 29 : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను బంధించి..హింసించి.. అతికిరాతకంగా కొట్టి చంపాడు. పైగా కట్టుకథ అల్లి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం డివిజన్ దేవేందర్‌నగర్ బతుకమ్మ బండలో మమత (43), బాలకృష్ణ దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మమతను బాలకృష్ణ గురువారం ఉదయం ఇంట్లో బంధించి.. మద్యం తాగిస్తూ… హింసించడం మొదలు పెట్టాడు. కొన్ని గంటల పాటు విపరీతంగా కొట్టడంతో దెబ్బలు తాళలేక ఆమె శుక్రవారం ఉదయం చనిపోయింది. కుటుంబసభ్యులు తలుపులు బిగించుకొని.. గేట్లు వేసుకొని.. మృతదేహంతో ఇంట్లోనే ఉన్నారు.
రక్తపు మరకలను కడిగేశారు. మధ్యాహ్నం అంబులెన్స్‌ను రప్పించుకున్నారు. అందులోకి మృతదేహాన్ని ఎక్కిస్తుండగా, అనుమానం వచ్చిన స్థానికులు బాలకృష్ణను నిలదీశారు. అతడు కట్టుకథ అల్లబోయాడు. స్థానికులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ బాలరాజు మృతదేహాన్ని పరిశీలించి.. పంచనామా నిర్వహించారు. మమత శరీరంపై తీవ్ర మైన గాయాలు ఉండటంతో బాలకృష్ణ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. బాలకృష్ణ, అతడి కుమారులు లక్ష్మణ్, శివశంకర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.