సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): మహా నగరంలోని మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో పదుల సంఖ్యలో బస్తీవాసులు అనారోగ్యానికి గురికావడం అందరినీ కలవరపరుస్తుంది. ఇప్పటికే ఇద్దరు మృతి చెందిన ఈ ఘటనలో అసలు కారణం అనేది ఎవరికీ అంతుబట్టడం లేదు. కలుషిత నీరంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేసిన దరిమిలా.. జలమండలి అధికారులు నాలుగు రోజులుగా సమస్య ఉందనే దానిపై లోతుగా అధ్యయనం చేశారు. చివరకు నీటి నమూనా నాణ్యత పరీక్షల్లోనూ అంతా సంతృప్తికరంగా ఉందనే నివేదిక రావడంతో సమస్య ఎక్కడ ఉందనేది అంతుబట్టకుండా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా పాత మంచినీటి పైపులైన్ వ్యవస్థను మార్చి.., కొత్త పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే శాశ్వత పరిష్కారం లభించినట్టుగా ఉంటుందని, అనుమానాలకు తావు ఉండదనే నిర్ణయానికి జలమండలి అధికారులొచ్చారు. ఈ మేరకు అర కిలోమీటరు మేర కొత్త పైపులైన్ నిర్మాణాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో అధికారుల పరీక్షలు
మాదాపూర్ గుట్టల బేగంపేటలోని వడ్డెర బస్తీలో ఈ నెల ఏడో తేదీ నుంచి పలువురు అస్వస్థతకు గురవుతున్న విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో బస్తీవాసులకు వాంతులు, విరోచనాలు అవుతున్న కారణంగా కొండాపూర్ ఏరియా ఆస్పత్రితో పాటు గాంధీ, ఉస్మానియాలోనూ చికిత్స అందిస్తున్నారు. అయితే, వీరి అస్వస్థతకు కారణం ఏమిటనేది అధికారులకు అంతుబట్టడం లేదు. జలమండలి అధికారులు ఏడో తేదీ నుంచి క్షేత్రస్థాయిలోనే ఉంటూ నల్లా నీటితో పాటు బస్తీవాసుల ఇండ్లలోనూ నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు. జల మండలికి చెందిన ఆసిఫ్‌నగర్ సెంట్రల్ ల్యాబ్‌తో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ చేసిన పరీక్షల్లో ఏ ఒక్క నమూనాలోనూ కలుషితానికి సంబంధించిన ఆనవాళ్లు తేలలేదు. కాలిఫాం, ఇ-కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని పరీక్షల్లో వెల్లడైంది. ఇతర నాణ్యతా ప్రమాణాల్లోనూ సంతృప్తికరమే అని తేలింది.
అపరిశుభ్రత కారణమా..?
సుమారు వంద కుటుంబాలు ఉండే ఆ బస్తీలో 69 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ప్రశాసన్ నగర్ రిజర్వాయర్ నుంచి వడ్డెర బస్తీతో పాటు అనేక ప్రాంతాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. అయితే, బస్తీలలో నల్లా నీళ్లు పట్టుకునే చోట అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో పాటు చాలాచోట్ల మరుగుదొడ్ల పక్కనే కనెక్షన్లు ఉన్నాయి. నల్లా చుట్టూ ఉండే అపరిశుభ్రమైన నీరు పైపులైన్లలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. ఇలా పలు రకాలుగా నీరు కలుషితం అయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు నీటి నమూనా పరీక్షల్లో ఎక్కడా మంచినీరు కలుషితం అయినట్లుగా వెల్లడి కానప్పటికీ, ఇక ముందు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు జల మండలి అధికారులు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు నిర్ణయించారు.
పాత పైపులైన్‌ను పూర్తిగా తీసేసి..
వడ్డెర బస్తీకి సంబంధించిన మంచినీటి సరఫరా వ్యవస్థలో అర కిలోమీటరు మేర ఉన్న పాత పైపులైన్‌ను పూర్తిగా తీసేసి.. కొత్త లైన్లు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 100, 150, 200 డయా పైపులైన్లను పూర్తిగా మార్చడంతో పాటు బస్తీవాసుల నల్లా కనెక్షన్లను కూడా పునరుద్ధరించి… ఇప్పుడున్న విధంగా కాకుండా కలుషితానికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టనున్నారు. దీనికి తోడు బస్తీవాసులకు కూడా నీరు కలుషితం కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనా అవగాహన కల్పించనున్నారు.
నీరు పూర్తిగా సురక్షితం
వడ్డెర బస్తీలో సరఫరా జరిగిన నీటిలో ఎలాంటి హానికర రసాయనాలు, బ్యాక్టీరియా (ఈ-కొలి) లేవని పలు అధ్యయనాల్లో తేలింది. మాదాపూర్ వడ్డెర బస్తీలో ఈ నెల 7వ తేదీన వాంతులు, విరేచనాలతో కూడిన అతిసారం ప్రబలిందని స్థానిక ఏఎన్ఎం సమాచారం అందగా, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బందితో హుటాహుటీన అక్కడ మెడికల్ క్యాంపు ప్రారంభించాం. జిల్లా ఎపిడెమిక్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అక్కడికి చేరుకుని ఆరోగ్య సిబ్బందితో ప్రతి ఇంటికీ సర్వే చేయించి, వాంతులు విరేచనాలు స్వల్పంగా ఉన్న వారందరికీ చికిత్స అందించాం. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని స్థానిక జిల్లా ఆసుపత్రి కొండాపూర్‌కి పంపి మెరుగైన వైద్యం అందించాం. ఈ నెల 8న తాగునీటి నమూనాలను తీసుకొని రాష్ట్ర నిర్ధారణ కేంద్రం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపగా, నీటిలో ఎలాంటి హానికర రసాయనాలు లేవని ఫలితాలు సోమవారం వచ్చాయి.
– డాక్టర్ స్వరాజ్య లక్ష్మి, డీఈవో, రంగారెడ్డి
పక్షవాతం, అవయవాలు విఫలమవడంతోనే మృతి: స్పష్టం చేసిన గాంధీ వైద్యులు
కనకమ్మ పక్షవాతంతో బాధపడుతున్నదని, వడదెబ్బకు గురికావడంతో కిడ్నీలు, కాలేయం దెబ్బ తిన్నాయని గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్ లేదా కలుషిత నీరు వంటి సమస్యలకు గురైన రోగులు ఎంత సీరియస్‌గా ఉన్నా రక్షించే అవకాశం ఉందని తెలిపారు. కనమ్మ ప్రధానంగా పక్షవాతంతో బాధపడటం, కిడ్నీ, కాలేయం దెబ్బ తినడంతో మరణించినట్లు డాక్టర్ రాజారావు స్పష్టం చేశారు.